క్రిష్ణగిరి/ కోడుమూరు, న్యూస్‌లైన్:‘ ఏమొచ్చింది నాయనా... ఈ కాంగిరేసోళ్లకు... ఈ రాష్ట్రాన్ని ఇడగొడుతున్నారంట... పిల్లల బతుకులు ఏంగావాలా? బతికేదెట్లా? ఇడగొడితే ఈ కాలవకి నీళ్ళు రావంటా? మీరే ఏదైనా సేయండయ్యా..’’అంటూ మహబూబ్ బీ (70) అనే వృద్ధురాలు.. వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డికి విన్నవించుకుంది. సమైక్యాంధ్ర కోసం ఆయన చేపట్టిన సమైక్య పోరు పాదయాత్ర నాలుగోరోజు శుక్రవారం లాలుమాను పల్లె నుంచి ప్రారంభమై చుంచుఎరగ్రుడి, ఎరుకలి చెరువు, క్రిష్ణగిరి, చెరుకులపాడు మీదుగా వెల్దుర్తి వరకు దాదాపు 28 కి.మీ.లమేర కొనసాగింది. కె.యి.
సోదరులకు కంచుకోటగా ఉన్న క్రిష్ణగిరి మండలంలో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రను చూసేందుకు పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు వచ్చారు. ప్రయాణికులు తమ వాహనాలను ఆపి ఆయనతో కరచాలనం చేశారు. క్రిష్ణగిరి గ్రామం దగ్గర రాముడు అనే రైతు తన గోడును కోట్ల హరిచక్రపాణిరెడ్డికి విన్నవించాడు.
సాగుచేసిన వేరుశనగ పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గురించి ప్రభుత్వానికి చెప్పాలని కోరాడు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నెకల్లు సురేంద్ర రెడ్డి, కరుణాకర్ రెడ్డి, క్రిష్ణగిరి మండల కన్వీనర్ చిట్యాల రాజేశ్వర్ గౌడ్, బీసీసెల్ మండల కన్వీనర్ రామాంజనేయులు, లకిష్మకాంతా రెడ్డి, కోవెలకుంట్ల వెంకటేశ్వర్లు, ఎస్.ఎరగ్రుడి బజారి, మహిళా మండల కన్వీనర్ రాములమ్మ, కోడుమూరు మండల కన్వీనర్ గిరిప్రకాశ్ రెడ్డి, టౌన్ కార్యదర్శి డీలర్ క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్యకర్తల్లో నూతన ఉత్తేజం: సమైక్యాంధ్ర కోసం కోట్ల హరిచక్రపాణి రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. క్రిష్ణగిరి మండలంలోని గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు. దారుల వెంట ప్రజలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.