ఓట్లు, సీట్లు.. అధికారమే పరమావధిగా రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు జూలై 30న విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో పురుడుపోసుక్ను సమైక్య ఉద్యమం తమ మనోభిప్రాయాలను ‘అధికారం’ కోసం తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీలను చీదరించుకుంటోన్న జనం మనోభీష్టాల మేరకు సమైక్యాంధ్ర ఉద్యమ బావుటా ఎగరవేసిన వైఎస్సార్‌సీపీకీ జైకొడుతున్న ప్రజాసైన్యం విశాలాంధ్ర ప్రజారాజ్యమన్న సీపీఐ విభజనకు జైకొట్టిన వైనం.. సమైక్యాంధ్రకే కట్టుబడిన సీపీఎం
తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీసేందుకు సిద్ధమైన కమలనాథులపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం జనంతిరగబడటంతో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రణాళికపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్,టీడీపీ అగ్రనేతలు 2013లో ‘అనంత’ రాజకీయ ప్రస్థానం ఇదీ..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభిప్రాయాలను గౌరవించని రాజకీయపార్టీలకు మనుగడ ఉండదన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. రాష్ట్ర విభజన ప్రక్రియలో అది మరో సారి నిరూపితమైంది. ఓట్లు, సీట్లే ప్రాతిపదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేశాయి. అధికారం కోసం ప్రజల మనోభిప్రాయాలను తాకట్టు పెట్టాయి. తమ మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్, టీడీపీలను జనం చీదరించుకుంటున్నారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా ‘అనంత’లో పురుడుపోసుకున్న ‘సమైక్య’ ఉద్యమం సీమాంధ్రకు దావానలంలా వ్యాపించి.. మహోద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజల మనోభీష్టాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి వెంట ‘అనంత’ జనం కదంతొక్కుతున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమన్న నినాదాన్ని ఆరు దశాబ్దాలపాటు ప్రతిధ్వనింపజేసిన సీపీఐ ప్లేటు ఫిరాయించి.. వేర్పాటువాదం ఎత్తుకుంది. ప్రజల మనోభిప్రాయాల మేరకు సీపీఎం సమైక్యాంధ్రకే కట్టుబడింది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సహకరిస్తామంటోన్న కమలనాథులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ‘అనంత’ రాజకీయాలను 2013 ఓ కుదుపు కుదిపేసింది.
ఏడాది ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 30, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని రాజకీయశక్తిగా వైఎస్సార్‌సీపీ అవతరించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ(డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురువేస్తుందనే సాకుతో ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయించింది. అధికారం కోసం సహకార వ్యవస్థను నీరుగార్చుతోంది.
పంచాయతీల్లోనూ కుమ్మక్కు పర్వం
సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి రచించిన ప్రణాళికను రైతులు ఛీ కొట్టారు. అయినా.. ఆ రెండు పార్టీలు తీరు మార్చుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సూత్రాన్ని అమలుచేశాయి. జూలై 23, 27, 30 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించలేదు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను పోటీకి దించకుండా ముందస్తుగా కుదుర్చుకున్న అవగాహనను అమలుచేశాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను చావుదెబ్బతీయాలన్న కుట్రను ప్రజలు చీదరించుకున్నారు. సింహభాగం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారు.
ప్రజాభిమానంతో వైఎస్సార్‌సీపీ కదం తొక్కుతుండటంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక రచించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారు. విశాలాంధ్రలోనే ప్రజారాజ్యమన్న నినాదంతో ఆరు దశాబ్దాలపాటూ నడచిన సీపీఐ వేర్పాటువాదంతో జతకట్టింది. సీపీఎం మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడింది. సీట్లే లక్ష్యంగా కమలనాథులు తెలుగుజాతిని రెండు మక్కలు చేయడానికి సహకరిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగా కాంగ్రెస్ ఏపీ విభజనకు కుట్ర పన్నింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ పక్షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ జూలై 30న తీర్మానం చేశాయి.
సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర
సమైక్య ఉద్యమంతో రాజకీయ మనుగడ ఉండదని కాంగ్రె స్, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విడదీసి.. తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా బలంగా ముందుకు తెచ్చారు. సమైక్య ఉద్యమంలో ముసుగువీరుడైన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెరచాటుగా జేసీతో చేతులు కలిపి.. రాయలతెలంగానం చేశారు. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రపై ‘అనంత’ ప్రజానీకం తిరగబడ్డారు. ప్రజాసైన్యం తిరగబడటంతో రాయలతెలంగానం ప్రతిపాదనను పక్కనపెట్టారు. ‘రాయల తెలంగాణపై నన్ను ముందుకు తోసి.. ఆ తర్వాత అంతా తప్పుకున్నారు’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల ప్రకటించడమే అందుకు తార్కాణం.
‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం
విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానలంలా వ్యాపించింది. సమైక్య ఉద్యమంలో సీమాంధ్రకు ‘అనంత’ మార్గనిర్దేశనం చేసింది. వేర్పాటువాదం చేసిన టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ అడ్టుకుంటూ ఛీకొట్టారు.
ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబరు 4న సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో నిర్వహించిన సభలకు జనం భారీ ఎత్తున హాజరై, మద్దతు ప్రకటించారు.
విభజన తీర్మానానికి నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సారి.. టీనోట్‌పై కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడానికి నిరసనగా మరొక సారి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో అక్టోబరు 26న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు ‘అనంత’ ప్రజానీకం భారీ ఎత్తున తరలివెళ్లారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలుగుతారని జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీల నేతలు జంకుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం.
సమైక్యోద్యమం
Published Mon, Dec 30 2013 4:09 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement