Vishalandhra
-
‘సి రాఘవాచారి అభిమానులకు విజ్ఞప్తి.. ఆయన వ్యాసాల సమాచారం ఉంటే పంపగలరు’
సుప్రసిద్ధ పాత్రికేయులు, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి రాఘవాచారి గారి అభిమానులకు, మిత్రులకు విజ్ఞప్తి.. రాఘవాచారి గారు ఎన్నో వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చారు. వివాహాలు చేశారు. అనేక సంస్థల వారు నిర్వహించిన ఎన్నో సభల్లో ఉపన్యసించారు. ఎన్నో సన్మానాలందుకున్నారు. బహుశా కొందరైనా వాటిని రికార్డు చేసి భద్రపరచి వుండవచ్చు. మా దృష్టికి రాకుండా వివిధ పత్రికల్లో వారి వ్యాసాలు గాని, వారి కృషి గురించి గాని వ్యాసాలు వచ్చి ఉండవచ్చు. అలా మరుగున ఉండిపోయిన ప్రసంగాల రికార్డింగ్‌లు, లేదా వ్యాసాల గురించి ఎలాంటి సమాచారం లభించినా సి. రాఘవాచారి ట్రస్టుకు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం. వీలైతే ట్రస్ట్ అడ్రస్ కు పంపవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పంప వలసిన చిరునామాలు:- కనపర్తి జ్యోత్స్న మేనేజింగ్ ట్రస్టీ సి.రాఘవాచారి ట్రస్టు ప్లాట్ నంబర్ 14 నారాయణ స్కూల్ ఎదురు రోడ్డు మారుతి నగర్ సికింద్రాబాద్ - 11. ఫోన్: 79818 81912 dmct.vja@gmail.com బుడ్డిగ జమిందార్, డోర్ నెం. 54-14/311/A శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలని విజయవాడ - 520008 ఫోన్ - 98494 91969 jamindarbuddiga@gmail.com ‘నివాళి’ సంపాదకీయాలు! ధర్మనిష్ఠకు, వామపక్ష పాత్రికేయ స్ఫూర్తికి నిబద్ధమైన కొండగుర్తు చక్రవర్తుల రాఘవాచారి. శుద్ధ సంప్రదాయ కుటుంబంలో పుట్టి సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని, సంప్రదాయ కళలతో పాటు న్యాయ శాస్త్రాన్ని ఔపోశన పట్టిన సి.రాఘవాచారి ‘నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం’గా తెలుగునాట పేరు గడించారు. జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలను తోసిరాజని విశాలాంధ్ర దినపత్రికకు దాదాపు 3 దశాబ్దాలు సంపాదకునిగా ఉన్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కమ్యూనిస్టు నీతికి ఆసాంతమూ కట్టుబడిన రాఘవాచారి కలం నుంచి జాలువారిన సంపాదకీయాలు నేటికీ ప్రామాణికాలని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తొమ్మిది వేలకు పైగా సంపాదకీయాలు వెలువరించారాయన. వీటిలో ఎంపిక చేసిన సంపాదకీయాలను సంపుటాలుగా ప్రచురించే బాధ్యతను సి.రాఘవాచారి ట్రస్టు చేపట్టడం సంతోషదాయకం. ప్రథమ వర్ధంతి సందర్భంగా సాహిత్యం, సంస్కృతి, కళలపై ఆయన సంపాదకీయాలను మొదటి సంపుటిగా ఆవిష్కరించారు. ‘నివాళి’ సంపాదకీయాలతో కూడిన రెండవ సంపుటిని ట్రస్టు ఇటీవల వెలువరించింది. కమ్యూనిస్టు యోధుడు భవానీసేన్ మొదలుకొని, నీలం రాజశేఖరరెడ్డి వరకు.. 112 నివాళి సంపాదక వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. ‘‘ఈ నికృష్ట పరిస్థితుల నిర్మూలనకూ, అన్ని రకాల దోపిడీ అంతానికి దీక్షాధారులై చైతన్యంతో ఉద్యమించడం అంబేద్కర్ స్మృతికి మనం అర్పించగల నిజమైన శ్రద్ధాంజలి! ఇతరాలన్నీ శుష్క లాంఛనాలు!’’ అంటూ రాఘవాచారి అంబేద్కర్‌కు 32 ఏళ్ల క్రితం అక్షర నివాళులర్పించారు. రాజకీయ, చారిత్రక అంశాల అధ్యయనంపై ఆసక్తి గల వారికి సి. రాఘవాచారి సంపాదకీయాల మొదటి, రెండవ సంపుటాలు విజ్ఞాన గనులే! – పంతంగి రాంబాబు నివాళి – ‘విశాలాంధ్ర’ రాఘవాచారి సంపాదకీయాలు (రెండో సంపుటి) ప్రచురణ: సి.రాఘవాచారి ట్రస్ట్ పేజీలు: 295 వెల : రూ. 200 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్, నవచేతన బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు / బుడ్డిగ జమిందార్ (విజయవాడ), మొబైల్: 98494 91969 -
స్వచ్ఛమైన అక్షరం..స్నేహమయ వ్యక్తిత్వం
ఆదర్శాలు మాట్లాడటం వేరు. ఆదర్శంగా జీవించడం వేరు. ఆదర్శంగా జీవిస్తూ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకుండా అదేం పెద్ద గొప్ప కాదు అన్నట్టుగా మరింత గొప్పగా జీవించడం వేరు. రాఘవాచారి ఆ గొప్పతనం ఉన్న గొప్పమనిషి. చక్రవర్తుల రాఘవాచారి అంటే ఎవరూ గుర్తుపట్టరు. సి.రాఘవాచారి అనగానే ఆ తెల్లటి స్వచ్ఛమైన రూపం గుర్తుకు వస్తుంది. పాత్రికేయుడిగా బహు సుపరిచితుడు. కాని వ్యక్తిగా రాఘవాచారిని పరిచయం చేయడమే చాలా కష్టం. ఒక అమృత హృదయుడి గురించి పరిచయం చేయడానికి మనకు అర్హత ఉందా లేదా అని అంతరాత్మ తప్పనిసరిగా మథన పడుతుంది. తుది శ్వాస వరకు రాఘవాచారి కమ్యూనిస్టుగానే నిరాడంబరంగా జీవించి, ఆదర్శంగా నిలిచారు. స్థితప్రజ్ఞత, పూర్వభాషణం, మృదుభాషణం ఆయన లక్షణాలు. రాఘవాచారి గారిది ఆదర్శ వివాహం. బాల్యంలో శ్రీవైష్ణవానికి అనుగుణంగా త్రికాల సంధ్యావదనం చేశారు. వైష్ణవ నామాలు, వెనకాల పిలక, పంచెకట్టు, చేతులకు శంఖుచక్రాలు వేయించుకున్నారు. అంతటి నిష్ఠాగరిష్టులైన రాఘవాచారి డిగ్రీ చదువుతుండగా కమ్యూనిజానికి ప్రభావితులయ్యారు. తన ఆలోచనలను మార్చుకున్నారు. పేరు మార్చుకోవలసిన అవసరం ఏముంది? ఆచారి అని ఉంచుకుంటే మాత్రమేం ఆలోచన, ఆచరణలో ఆ పేరు తనకు ఆటంకం కాబోదు కదా అనుకున్నారు. రాఘవాచారి అజాత శత్రువు, ఎవ్వరినీ విమర్శించరు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక గ్రంధాలయమంతా కలియతిరిగిన భావన కలుగుతుంది. రాఘవాచారికి ఇద్దరు ఆడ పిల్లలు. 1990 ఆగస్టులో రెండో అమ్మాయి ప్రమాదవశాత్తు మరణించింది. ఆ సమయంలో రాఘవాచారి నిబ్బరంగా కూర్చోవడం చూసి ఆయనతో ‘అమ్మాయి పోయింది కదా!’ అని అడిగితే, ‘బతికుంటే బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేది’ అన్నారే కాని ‘విధి నా మీద పగబూనింది’ లాంటి చిన్న మాటలు ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ఇలా ఉంటే, రాఘవాచారికి అత్యంత ఆత్మీయుడైన రేడియో దిగ్గజం ఉషశ్రీ సెప్టెంబరు 7, 1990 లో కన్ను మూశారు. అప్పటికి రాఘవాచారి అమ్మాయి పోయి పూర్తిగా నెల కూడా కాలేదు. ఉషశ్రీ హైదరాబాదు ఆసుపత్రిలో గతించే సమయానికి విజయవాడలోని ఉషశ్రీ ఇంట్లో ఆయన తల్లి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టీవీలో వార్తలలో అకస్మాత్తుగా తండ్రి గతించిన వార్త చూస్తే పిల్లలు ఏమైపోతారో ఏమోనని రాఘవాచారి సతీమణి జ్యోత్స ్న గబగబ ఉషశ్రీ ఇంటికి చేరి విషయం చెప్పారు. ఒక పక్కన తండ్రి పోయినందుకు బాధపడాలో, కూతురు పోయిన బాధలో కూడా ఉషశ్రీ కూతుళ్ల గురించి ఆలోచించిన ఆయన విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించాలో తెలియదు. ఉషశ్రీ, రాఘవాచారిది విచిత్రమైన అనుబంధం. ఉషశ్రీ రిటైరయ్యాక, మధ్యాహ్నం భోజనం చేశాక, నిద్ర మధ్యలో లేపద్దని చెప్పి నిద్రపోయేవారు. సరిగ్గా అదే సమయానికి రాఘవాచారి విశాలాంధ్ర ఆఫీసులో ఎడిటోరియల్ పూర్తి చేసి ఐదో నెంబరు బస్సు దిగి, ఉషశ్రీ ఇంటి మీదుగా ఇల్లు చేరుకునేవారు. తప్పనిసరిగా ఉషశ్రీ ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్లు తాగి ఉషశ్రీతో కొద్దిసేపు చర్చించి వెళ్లేవారు. ఆయన వస్తే, మాత్రం తప్పకుండా నిద్ర లేపమనేవారు. ఇద్దరూ శ్వేతవస్త్రాలే ధరించడం, ఇద్దరివీ కమ్యూనిస్టు భావాలే కావడం, ఇద్దరికీ సాహిత్య చర్చలంటే ఇష్టం కావడంతో, వీరిద్దరి మధ్య అనుబంధం సన్నని లతలా పెనవేసుకున్నట్లు కూడా తెలియనంత గాఢంగా పెనవేసుకుంది. వారిద్దరూ మార్నింగ్ వాక్ చేస్తుంటే చూసినవారంతా వేదవ్యాస్, కార్ల్ మార్క్స్ అనుకునేవారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకునేవారు. ఉషశ్రీ గతించి మూడు దశాబ్దాలు అవుతున్నా రాఘవాచారి తుదిశ్వాస వరకూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెనవేసుకునే ఉన్నారు. తామరాకు మీద నీటిబొట్టు అనే మాట రాఘవాచారికి అన్వయించినట్లుగా మరొకరికి పొసగదు. రాఘవాచారి ఎంత సామాన్యంగా జీవిస్తారో ఒకరు చెప్పవలసిన పని లేదు. ఒక పత్రికకు అతి చిన్న వయసులో ఎడిటర్ అయ్యి, అదే పత్రికకు మూడు దశాబ్దాల పాటు అతి తక్కువ జీతానికి ఎడిటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క జర్నలిస్టు బహుశా రాఘవాచారి మాత్రమేనేమో. విజయవాడలో 16 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి, ఆ తరవాత సొంత ఇల్లు కట్టుకుని, అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాక, కొన్ని కారణాల వల్ల ఇల్లు అమ్మేశారు. ‘మీకు బాధగా లేదా’ అని ఎవరో ప్రశ్నిస్తే, స్వచ్ఛమైన చిరునవ్వులు నిండిన పెదవులతో, ‘ఏముంది షోడశ సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాను. మరో షోడశ కాలం సొంత ఇంట్లో ఉన్నాను. మళ్లీ అద్దె ఇంట్లో ఎంతకాలమంటే అంత కాలం’ అని నిజాయితీగా అనేవారు. అసంతృప్తికి అర్థం తెలియదు రాఘవాచారికి. ఆయనకు అనారోగ్యమని తెలిసి ఎవరైనా పలకరించడానికి వెళితే ఆయన తన అనారోగ్య విషయం తప్ప మిగిలిన ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాట్లాడేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, మార్క్సిజం, న్యాయశాస్త్రం, స్టాటిస్టిక్స్... అన్ని అంశాల మీద తడబాటు లేకుండా మాట్లాడగలిగిన శక్తి రాఘవాచారికి ఎక్కడ నుంచి వచ్చిందో మరి. ఆయనకు పెద్దచిన్న తారతమ్యం తెలియదు. మానవులంతా ఒకటే అనే ఆత్మ కలిగిన రాఘవాచారి రాజకీయనాయకుడిని, రిక్షా తొక్కుకునే వ్యక్తిని, టీ అమ్ముకునే కుర్రవాడిని అందరినీ సమదృష్టితో పలకరించేవారు. – వైజయంతి -
కశ్మీర్లో నిషిద్ధ రాత్రి
మలుపు ప్రచురణ; వెల: రూ.150 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ ‘ప్రయాణం ముగియలేదు. అది ఎప్పటికీ ముగియదు. 1990 నుంచి పగళ్ళు భయంతో రాత్రిళ్లు కర్ఫ్యూతో కొనసాగుతున్నాయి. ఆ వాతావరణంలో అప్పుడు 14 ఏళ్ల వయసు ఉన్న నేను మత్తెక్కించే స్వాతంత్రోద్యమ నినాదాలతో సరిహద్దు మంచులో ప్రమాదకరమైన ప్రస్థానాలు వింటూ ఉత్తేజితుడనై ఉండేవాణ్ణి’ అని మొదలవుతుంది ఈ పుస్తకం. 1987లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన అల్లకల్లోలం కాశ్మీరీలలో నిద్రపోతున్న స్వతంత్రేచ్ఛని తట్టి లేపడమే కాకుండా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదం విలయతాండవం చేసింది. 1990లో జగ్మోహన్ అనే కరడుగట్టిన ముస్లిం వ్యతిరేకిని గవర్నరుగా పంపి సాయుధ దళాలకు నియంత్రణ లేని స్వేచ్ఛనిచ్చి భారత ప్రభుత్వం కాశ్మీర్ సమాజాన్ని అతలాకుతలం చేసింది. ‘పాశవికత, ధైర్యం, ప్రేమ, ద్వేషం చివరకు ఇంకా నమ్మకంతో ఉన్న కథలు విన్నాను. జ్ఞాపకం పెట్టుకున్నాను’ అంటాడు బషారత్ పీర్. కాశ్మీరీ పత్రికా విలేకరి అయిన ఈ రచయిత కాశ్మీరీల వ్యదార్థ బతుకు చిత్రాన్ని మన ముందు ఉంచిన చారిత్రక నివేదిక ‘కర్ఫ్యూడ్ నైట్’ తెలుగులో యార్లగడ్డ నిర్మల తెలుగు అనువాదంతో ‘కశ్మీర్లో నిషిద్ధ రాత్రి’గా వెలువడింది. ఒకటి అరా తప్ప ఏ సమాచార మాధ్యమమూ మన ముందు ఉంచని కాశ్మీరీల కన్నీటి కథలు ఇవి. రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలకి సంవత్సరాలు సైనిక దురాగతాలు, తీవ్రవాదుల నిర్బంధాల మధ్య కాశ్మీరీ సమాజం చిక్కుంది. ఉదయం మందు పాతరల పేలుళ్లు, ైసైనిక తనిఖీలు, గుర్తింపు కార్డులు లేనివాళ్లని బతికున్న మనుషులుగానే గుర్తించని బలగాలు, సాయంత్రం ఆరు దాటగానే బయటకు అడుగు పెట్టలేని దుస్థితి... ఇదీ కాశ్మీర్ పరిస్థితి. తియాన్మెన్ స్క్వేర్ అణచివేతను మించిన గాక్‌డాల్ వంతెన మీద హత్యాకాండ, గ్వాంటినమో బేని తలదన్నే ‘పాపా-ఇ’ కాన్సన్ట్రేషన్ క్యాంప్... ఇవన్నీ కాశ్మీరు బుక్మార్కులు. ఒకటా రెండా ఎన్నెన్ని కథలు. మీసాలు కూడా సరిగా రాని తమ పిల్లలు తీవ్రవాదాన్ని తలకెత్తుకున్నప్పుడు అటు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇంట్లో పెద్దలు పడే తపన, తీవ్రవాదంలో చేరినవాళ్ల ఆచూకీ కోసం ఇంట్లో వాళ్లందరినీ చావచితక కొట్టే సైనికులు, ఊళ్లో మందు పాతరలు పెట్టొద్దని కాళ్లావేళ్లా పడినా వినని ఉగ్రవాదులు, ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో భాగంగా ఊళ్లని ఊళ్లే తగలబెట్టే సైనికులు, ఉగ్రవాదుల మధ్య చిచ్చు పెట్టడానికి సాయుధ బలగాలు సృష్టించిన సంస్థలు, సైనిక బంకర్లుగా మారిన దేవాలయాలు, పాఠశాలలు- వీటి మధ్యే కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా బతికింది. ఇక అదృశ్యం అయినవాళ్లకు, గుర్తు తెలియని మృతదేహాలకు లెక్కే లేదు. ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ని భూతాల స్వర్గంగా మార్చేశాయి. ‘నేనూ కాశ్మీర్ ఇద్దరమూ మారిపోయాం. కాశ్మీర్ అలసిపోయింది. నేను పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు వీధుల్లో ఘర్షణ లేకపోవచ్చు. కాని అది ఆత్మల్లో నుంచి వెళ్లదు’ అంటాడు బషారత్ పీర్. గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్న కాశ్మీర్ మళ్లీ ఏ ‘క్షిపణి- 370’ని ఎదుర్కోబోతోందో అనే ఆలోచన కలిగినప్పుడు భయం వేస్తుంది. ఏ వాదనల పక్షమూ వహించకుండా యదార్థాలని మన ముందుంచిన బషారత్ పీర్ కాశ్మీర్ నేపధ్యంలో విశాల్ భరద్వాజ్ తీస్తున్న ‘హైదర్’ సినిమాకి కో రైటర్‌గా పని చేస్తూ మరే నిజాలు బయటకు తెస్తాడో చూడాలి. - కృష్ణమోహన్‌బాబు 9848023384 -
సమైక్యోద్యమం
ఓట్లు, సీట్లు.. అధికారమే పరమావధిగా రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు జూలై 30న విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో పురుడుపోసుక్ను సమైక్య ఉద్యమం తమ మనోభిప్రాయాలను ‘అధికారం’ కోసం తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీలను చీదరించుకుంటోన్న జనం మనోభీష్టాల మేరకు సమైక్యాంధ్ర ఉద్యమ బావుటా ఎగరవేసిన వైఎస్సార్సీపీకీ జైకొడుతున్న ప్రజాసైన్యం విశాలాంధ్ర ప్రజారాజ్యమన్న సీపీఐ విభజనకు జైకొట్టిన వైనం.. సమైక్యాంధ్రకే కట్టుబడిన సీపీఎం తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీసేందుకు సిద్ధమైన కమలనాథులపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం జనంతిరగబడటంతో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రణాళికపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్,టీడీపీ అగ్రనేతలు 2013లో ‘అనంత’ రాజకీయ ప్రస్థానం ఇదీ..! సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభిప్రాయాలను గౌరవించని రాజకీయపార్టీలకు మనుగడ ఉండదన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. రాష్ట్ర విభజన ప్రక్రియలో అది మరో సారి నిరూపితమైంది. ఓట్లు, సీట్లే ప్రాతిపదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేశాయి. అధికారం కోసం ప్రజల మనోభిప్రాయాలను తాకట్టు పెట్టాయి. తమ మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్, టీడీపీలను జనం చీదరించుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ‘అనంత’లో పురుడుపోసుకున్న ‘సమైక్య’ ఉద్యమం సీమాంధ్రకు దావానలంలా వ్యాపించి.. మహోద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజల మనోభీష్టాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వెంట ‘అనంత’ జనం కదంతొక్కుతున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమన్న నినాదాన్ని ఆరు దశాబ్దాలపాటు ప్రతిధ్వనింపజేసిన సీపీఐ ప్లేటు ఫిరాయించి.. వేర్పాటువాదం ఎత్తుకుంది. ప్రజల మనోభిప్రాయాల మేరకు సీపీఎం సమైక్యాంధ్రకే కట్టుబడింది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సహకరిస్తామంటోన్న కమలనాథులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ‘అనంత’ రాజకీయాలను 2013 ఓ కుదుపు కుదిపేసింది. ఏడాది ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 30, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని రాజకీయశక్తిగా వైఎస్సార్సీపీ అవతరించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ(డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురువేస్తుందనే సాకుతో ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయించింది. అధికారం కోసం సహకార వ్యవస్థను నీరుగార్చుతోంది. పంచాయతీల్లోనూ కుమ్మక్కు పర్వం సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి రచించిన ప్రణాళికను రైతులు ఛీ కొట్టారు. అయినా.. ఆ రెండు పార్టీలు తీరు మార్చుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సూత్రాన్ని అమలుచేశాయి. జూలై 23, 27, 30 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించలేదు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను పోటీకి దించకుండా ముందస్తుగా కుదుర్చుకున్న అవగాహనను అమలుచేశాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులను చావుదెబ్బతీయాలన్న కుట్రను ప్రజలు చీదరించుకున్నారు. సింహభాగం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. ప్రజాభిమానంతో వైఎస్సార్సీపీ కదం తొక్కుతుండటంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక రచించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారు. విశాలాంధ్రలోనే ప్రజారాజ్యమన్న నినాదంతో ఆరు దశాబ్దాలపాటూ నడచిన సీపీఐ వేర్పాటువాదంతో జతకట్టింది. సీపీఎం మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడింది. సీట్లే లక్ష్యంగా కమలనాథులు తెలుగుజాతిని రెండు మక్కలు చేయడానికి సహకరిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగా కాంగ్రెస్ ఏపీ విభజనకు కుట్ర పన్నింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ పక్షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ జూలై 30న తీర్మానం చేశాయి. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర సమైక్య ఉద్యమంతో రాజకీయ మనుగడ ఉండదని కాంగ్రె స్, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విడదీసి.. తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా బలంగా ముందుకు తెచ్చారు. సమైక్య ఉద్యమంలో ముసుగువీరుడైన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెరచాటుగా జేసీతో చేతులు కలిపి.. రాయలతెలంగానం చేశారు. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రపై ‘అనంత’ ప్రజానీకం తిరగబడ్డారు. ప్రజాసైన్యం తిరగబడటంతో రాయలతెలంగానం ప్రతిపాదనను పక్కనపెట్టారు. ‘రాయల తెలంగాణపై నన్ను ముందుకు తోసి.. ఆ తర్వాత అంతా తప్పుకున్నారు’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల ప్రకటించడమే అందుకు తార్కాణం. ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానలంలా వ్యాపించింది. సమైక్య ఉద్యమంలో సీమాంధ్రకు ‘అనంత’ మార్గనిర్దేశనం చేసింది. వేర్పాటువాదం చేసిన టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ అడ్టుకుంటూ ఛీకొట్టారు. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబరు 4న సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో నిర్వహించిన సభలకు జనం భారీ ఎత్తున హాజరై, మద్దతు ప్రకటించారు. విభజన తీర్మానానికి నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సారి.. టీనోట్‌పై కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడానికి నిరసనగా మరొక సారి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో అక్టోబరు 26న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు ‘అనంత’ ప్రజానీకం భారీ ఎత్తున తరలివెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలుగుతారని జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీల నేతలు జంకుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం. -
విశాలాంధ్రకు సీఎం జగనే
నాయుడుపేటటౌన్, న్యూస్‌లైన్: విశాలాంధ్రకు యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసల పెంచలయ్య నాయుడుపేటలో తన నివాసంలో ఆదివారం మేకపాటి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. పెంచలయ్యకు పార్టీ కండువా కప్పి మేకపాటి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రజాసేవ కోసం తపించే నాయకులకు వైఎస్సార్సీపీ ద్వారా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల నేతగా అంచలంచెలుగా ఎదిగిన పెంచలయ్య పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పటిష్టమైన నాయకత్వ లక్షణాలతో మంత్రిగా, ఎంపీగా పెంచలయ్య చేసిన సేవలు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికార సాధనే పరమావధిగా తెలుగు గడ్డను చీల్చే యత్నం చేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు అన్ని విధాలా పోరాడుతామన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం, విభజన వల్ల తలెత్తే సమస్యల తీవ్రతను రాష్ట్రపతికి వివరించడం, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించడం లాంటి అవకాశాలతో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రజలు సువర్ణయుగం చూశారని, యువనేత జగన్మోహన్రెడ్డి పాలనలో ఆ రోజులు మళ్లీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు రాజకీయ సునామీ తథ్యం : పసల ఇచ్చాపురం నుంచి తడ వరకు జగన్మోహన్రెడ్డి రాజకీయ సునామీ సృష్టించడం తథ్యమని, కుటీల రాజకీయ నాయకులు ఆ సునామీలో కొట్టుకుపోతారని మాజీ మంత్రి పసల పెంచలయ్య వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్ ఆశయాలను జగన్మోహన్రెడ్డి సాధిస్తారన్నారు. రాష్ట్రంలో 75 శాతం సీట్లు సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పటిష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక్క జగన్మోహన్రెడ్డేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, యువనేత పోరాటంతో ప్రజల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరిస్తాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడే లక్షణాలు యువనేత జగన్‌లో ఉన్నాయన్నారు. సమైక్యాంధ్ర కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతున్నారన్నారు. నియోజకర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పుట్టు వెంకటరమణమూర్తి, వెందోటి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. పెంచలయ్య లాంటి నాయకులు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన చేరిక కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. భారీగా వైఎస్సార్సీపీలో చేరిక మాజీ మంత్రి పసల పెంచలయ్యతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులను మేకపాటికి ఓడూరు గిరిధర్‌రెడ్డి పరిచయం చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన పాపాటి రవీంద్రరెడ్డి పలువురు సర్పంచ్‌లతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే ఓజిలి మండలంలోని పలువురు సర్పంచులు వైఎస్సార్ సీపీలో చేరారు. మేకపాటికి ఘనస్వాగతం మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కిలివేటి సంజీవయ్య, ఓడూరు గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెంచలయ్య నివాసం వద్ద ఎంపీపై రోజాపూల వర్షం కురిపిస్తూ బాణసంచా కాల్చుతూ కోలాహలం సృష్టించారు. బస్టాండ్ నుంచి పెంచలయ్య నివాసం వరకు భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, కామిరెడ్డి రామకృష్ణారెడ్డి, పేర్నాటి రఘురామిరెడ్డి, రాజసులోచనమ్మ, దొరై, నాగరాజు, పీ హరినాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.