కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి
మలుపు ప్రచురణ; వెల: రూ.150
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
‘ప్రయాణం ముగియలేదు. అది ఎప్పటికీ ముగియదు. 1990 నుంచి పగళ్ళు భయంతో రాత్రిళ్లు కర్ఫ్యూతో కొనసాగుతున్నాయి. ఆ వాతావరణంలో అప్పుడు 14 ఏళ్ల వయసు ఉన్న నేను మత్తెక్కించే స్వాతంత్రోద్యమ నినాదాలతో సరిహద్దు మంచులో ప్రమాదకరమైన ప్రస్థానాలు వింటూ ఉత్తేజితుడనై ఉండేవాణ్ణి’ అని మొదలవుతుంది ఈ పుస్తకం.
1987లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన అల్లకల్లోలం కాశ్మీరీలలో నిద్రపోతున్న స్వతంత్రేచ్ఛని తట్టి లేపడమే కాకుండా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదం విలయతాండవం చేసింది. 1990లో జగ్‌మోహన్ అనే కరడుగట్టిన ముస్లిం వ్యతిరేకిని గవర్నరుగా పంపి సాయుధ దళాలకు నియంత్రణ లేని స్వేచ్ఛనిచ్చి భారత ప్రభుత్వం కాశ్మీర్ సమాజాన్ని అతలాకుతలం చేసింది. ‘పాశవికత, ధైర్యం, ప్రేమ, ద్వేషం చివరకు ఇంకా నమ్మకంతో ఉన్న కథలు విన్నాను. జ్ఞాపకం పెట్టుకున్నాను’ అంటాడు బషారత్ పీర్.
కాశ్మీరీ పత్రికా విలేకరి అయిన ఈ రచయిత కాశ్మీరీల వ్యదార్థ బతుకు చిత్రాన్ని మన ముందు ఉంచిన చారిత్రక నివేదిక ‘కర్ఫ్యూడ్ నైట్’ తెలుగులో యార్లగడ్డ నిర్మల తెలుగు అనువాదంతో ‘కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి’గా వెలువడింది. ఒకటి అరా తప్ప ఏ సమాచార మాధ్యమమూ మన ముందు ఉంచని కాశ్మీరీల కన్నీటి కథలు ఇవి. రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలకి సంవత్సరాలు సైనిక దురాగతాలు, తీవ్రవాదుల నిర్బంధాల మధ్య కాశ్మీరీ సమాజం చిక్కుంది. ఉదయం మందు పాతరల పేలుళ్లు, ైసైనిక తనిఖీలు, గుర్తింపు కార్డులు లేనివాళ్లని బతికున్న మనుషులుగానే గుర్తించని బలగాలు, సాయంత్రం ఆరు దాటగానే బయటకు అడుగు పెట్టలేని దుస్థితి... ఇదీ కాశ్మీర్ పరిస్థితి. తియాన్‌మెన్ స్క్వేర్ అణచివేతను మించిన గాక్‌డాల్ వంతెన మీద హత్యాకాండ, గ్వాంటినమో బేని తలదన్నే ‘పాపా-ఇ’ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్... ఇవన్నీ కాశ్మీరు బుక్‌మార్కులు.
ఒకటా రెండా ఎన్నెన్ని కథలు. మీసాలు కూడా సరిగా రాని తమ పిల్లలు తీవ్రవాదాన్ని తలకెత్తుకున్నప్పుడు అటు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇంట్లో పెద్దలు పడే తపన, తీవ్రవాదంలో చేరినవాళ్ల ఆచూకీ కోసం ఇంట్లో వాళ్లందరినీ చావచితక కొట్టే సైనికులు, ఊళ్లో మందు పాతరలు పెట్టొద్దని కాళ్లావేళ్లా పడినా వినని ఉగ్రవాదులు, ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో భాగంగా ఊళ్లని ఊళ్లే తగలబెట్టే సైనికులు, ఉగ్రవాదుల మధ్య చిచ్చు పెట్టడానికి సాయుధ బలగాలు సృష్టించిన సంస్థలు, సైనిక బంకర్లుగా మారిన దేవాలయాలు, పాఠశాలలు- వీటి మధ్యే కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా బతికింది. ఇక అదృశ్యం అయినవాళ్లకు, గుర్తు తెలియని మృతదేహాలకు లెక్కే లేదు. ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ని భూతాల స్వర్గంగా మార్చేశాయి. ‘నేనూ కాశ్మీర్ ఇద్దరమూ మారిపోయాం. కాశ్మీర్ అలసిపోయింది. నేను పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు వీధుల్లో ఘర్షణ లేకపోవచ్చు. కాని అది ఆత్మల్లో నుంచి వెళ్లదు’ అంటాడు బషారత్ పీర్.
గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్న కాశ్మీర్ మళ్లీ ఏ ‘క్షిపణి- 370’ని ఎదుర్కోబోతోందో అనే ఆలోచన కలిగినప్పుడు భయం వేస్తుంది. ఏ వాదనల పక్షమూ వహించకుండా యదార్థాలని మన ముందుంచిన బషారత్ పీర్ కాశ్మీర్ నేపధ్యంలో విశాల్ భరద్వాజ్ తీస్తున్న ‘హైదర్’ సినిమాకి కో రైటర్‌గా పని చేస్తూ మరే నిజాలు బయటకు తెస్తాడో చూడాలి.
- కృష్ణమోహన్‌బాబు 9848023384