సమైక్యం కోసం.. | united agitation become severe in nellore district | Sakshi
Sakshi News home page

సమైక్యం కోసం..

Published Thu, Nov 7 2013 4:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

united agitation become severe in nellore district

సాక్షి, నెల్లూరు : వైఎస్సార్‌సీపీ రహదారుల దిగ్బంధం తొలిరోజు విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు బుధవారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పార్టీ సమన్వయకర్తలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు.
 
 ఇందుకు నిరసనగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై మరోమారు రాస్తారోకో చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అనిల్‌తో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.  గూడూరులో  పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు నేదరుమల్లి పద్మనాభరెడ్డి, బత్తిన విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద రాస్తారోకో నిర్వహించారు.  పోలీసులు నేతలను అరెస్టు చేశారు.
 
 జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయ్యారు. ఉదయగిరిలో ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో కార్యకర్తలు అరగంటపాటు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వింజమూరు బంగ్లా సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. కలిగిరిలోని కలిగరమ్మ దేవాలయం వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
 
 జలదంకి బస్టాండ్‌లో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలిరూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సహా 30 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం కూడలి వద్ద మండల కన్వీనర్ ఇందూరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచి పోయాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం జాతీయ రహదారిపై  పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి  నేతృత్వంలో రోడ్డును దిగ్బంధించారు.  కిలోమీటర్ల మేర  వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కాకాణితో సహా 26 మందిని అరెస్ట్‌చేశారు. సూళ్లూరుపేలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేశారు.
 
 తడలో పార్టీ కార్యకర్తలు ఆర్‌కే సుందరంరెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో తడ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నెలబల్లి, అక్కరపాక వద్ద జాతీయ రహదారుల దిగ్భంధం జరిగింది. నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లాం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేట-శ్రీకాళహస్తి రోడ్డులో జాతీయ రహదారులను దిగ్బంధించారు. వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు కూడలి వద్ద రహదారులను దిగ్బంధించారు.
 
 దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కలువాయిలో మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. సైదాపురంలో మండల కన్వీనర్ కష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు.  కోవూరు నియోజక వర్గంలోని కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రహదారుల దిగ్బంధం జరిగింది. కోవూరులో ములుముడి వినోద్‌రెడ్డి, ఇందుకూరుపేటలో మావులూరు శ్రీనివాసులురెడ్డి  ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు.  బుచ్చిరెడ్డిపాళెంలో  వైఎస్సార్‌సీపీ నాయకులు ముంబయి రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement