పోరాటం ఆగదు విద్యుత్ జేఏసీ
Published Thu, Oct 10 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రత్నామ్నాయాలు, ప్యాకేజీలతో తమను మభ్యపెట్టలేరని విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాతూరు పవర్ ఆఫీస్ నుంచి టవర్‌క్లాక్ వరకు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం, ప్యాకేజీలిస్తాం, మీ బాధను పంచుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం దారుణమన్నారు. నిజంగా వారికి సీమాంధ్రులపై అంతటి మమకారం ఉంటే, ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు.
సీమాంధ్రుల మనోభావాలను, వారి త్యాగాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రాతిబొమ్మలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతునివ్వడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఉద్యమం చేస్తున్నారని అభినందిస్తున్నారన్నారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వద్దకు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు చంద్రమోహన్, పద్మ, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, తులసీకృష్ణ, మేఘరాజు, రంగస్వామి, రంగయ్య, నాగరాజు, అక్రం, దాదాపీర్, ముత్తు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
Advertisement