Sampatkumar
-
ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు
టీఆర్ఎస్పై కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి కళంకం తెచ్చారని టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ విప్ ఎస్.ఎస్.సంపత్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి దాన్ని కప్పి పుచ్చుకోడానికి రూ.లక్షల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించుకుంది. అయినప్పటికీ రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అనర్హత పిటిషన్లపై జరిగిన జాప్యాన్ని ప్రశ్నించింది. తాజా ఉత్తర్వులతో న్యాయ వ్యవస్థపై మరింత విశ్వాసం పెరిగింది’అన్నారు. ఇప్పటికై నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. -
ఫిరాయింపులపై చర్యలకు ఆదేశాలివ్వండి
హైకోర్టులో కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఫిర్యాదుపై తక్షణమే నిర్ణయం వెలువరించేలా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్‌కుమార్ హై కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కాలె యాదయ్య, డి.ఎస్.రెడ్యానాయక్, జి.విఠల్‌రెడ్డి, కనకయ్యలు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. పార్టీ ఫిరాయించిన వీరిపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది ఆగస్టులో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై స్పీకర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమ వ్యాజ్యాలపై తగిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని సంపత్‌కుమార్ పిటిషన్లో కోరారు. -
‘రైస్ మిల్లర్స్’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
హన్మకొండ చౌరస్తా : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల పర్వం మొదలైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కోశాధికారి పదవులకు జరిగే ఎన్నికలకు నామినేషన్లు దాఖ లు చేయడానికి ఎన్నికల అధికారి రెండు రో జులపాటు వెసులుబాటు కల్పించారు. మొదటి రోజు అధ్యక్ష పదవికి ఆరుగురు, ప్రధాన కార్యదర్శి కోసం ఆరుగురు, కోశాధికారి పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి టి.చంద్రప్రకాష్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు కొనసాగిన నామినేషన్ల ఘట్టం రాజ కీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. నామినేషన్లకు అవకాశం ఉండడంతో మరి కొందరు వేసేందుకు అవకాశం కనిపిస్తోంది. ఆరుగురిలో ముగ్గురు మాజీలే... ప్రస్తుతం అధ్యక్ష పదవికి ఆరుగురు నామినేషన్లు వేయగా.. అందులో ముగ్గురు మాజీ అధ్యక్షులే కావడం గమనార్హం. ప్రస్తుతం దేవునూరి అంజయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, తోట సంపత్‌కుమార్, మేచినేని సంపత్‌కుమార్ గతంలో జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. కాగా, రాష్ట్ర కార్యవర్గంలో పెద్ది వెంకటనారాయణగౌడ్ కీలక పదవిలో కొనసాగారు. పి.పాండురంగయ్య, గోనెల రవీం దర్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు దాఖ లు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు వేసిన వారిలో ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, వి.వెంకటేశ్వర్లు, గండి రమేష్, వి.వేణుగోపాల్, బూశి ప్రభాకర్‌రెడ్డి, పాండురంగయ్య ఉండగా, కోశాధికారి కోసం దుబ్బ రమేష్, వేణుగోపాల్ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉపసంహరణకు 30న చివరి తేదీ కావడంతో అదేరోజు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. -
దుప్పటిలో ఎమ్మెల్యే తరలింపు
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు రెండు వేల అడుగుల ఎత్తుగల కొండపైకి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను దుప్పటిలో కూర్చోబెట్టి కర్రలతో అటవీవాసులు మోసుకెళ్లారు. వేలూరు జిల్లా వాణియంబాడి నియోజక వర్గం ఆలంగాయం యూనియన్ పరిధిలోని నెగ్నకొండ ఉంది. ఈ కొండపై 900 మందికి పైగా నివసిస్తున్నారు. మొత్తం 600 మంది ఓటర్లున్నారు. నిగ్నకొండకు వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి రోడ్డు వసతి మాత్రం ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో వానియంబాడి ఎమ్మెల్యే కోవై సంపత్‌కుమార్ ఆలంగాయం యూనియన్ పరిధిలో కరపత్రాలు అందజేశారు. ఆ ప్రాంతంలో ఆలంగాయం సర్పంచ్ గోపాల్ నె గ్న కొండలో 600 ఓట్లు ఉన్నాయని అక్కడ ప్రచారం నిర్వహించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తన కాలికి గాయం కావడంతో అంత ఎత్తునకు నడవ లేనని చెప్పారు. దీంతో అటవీ ప్రాంత గ్రామస్తులు కర్రపై దుప్పట్టి కట్టుకొని అందులో ఎమ్మెల్యేను కూర్చోబెట్టి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతవాసులు మోసుకెళ్లారు. మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే నెగ్నకొండకు వెళ్లడంతో అటవీ ప్రాంతవాసులు సంతోషించారు. వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు సమస్యలను వివరించారు. -
ఇద్దరు మిత్రుల బలవన్మరణం
చిలకలగూడ, న్యూస్‌లైన్: కలిసి చదువుకున్న ఇరువురు స్నేహితులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వీరి మృతి మిస్టరీగా మారింది. చిలకలగూడ పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెదక్‌జిల్లా దౌలతాబాద్ మండలం రామసాగర్‌కు చెందిన చంద్రమౌళి కుమారుడు బిక్కుమళ్ల సంపత్ (27), నిజామాబాద్జిల్లా కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కొత్త సంపత్‌కుమార్ (27)లు నగరంలో ఎంబీఏ చదువుకున్నారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. చదువు పూర్తయ్యాక సంపత్ మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, కంప్యూటర్ కోర్సులు చదవిన సంపత్‌కుమార్ బేగంపేటలోని సెల్యుజెనిక్ సంస్థలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు. వారాసిగూడ అంబర్‌నగర్‌లోని ముకుందం ఇంటి పెంట్‌హౌస్‌ను ఆరునెలల క్రితం సంపత్ అద్దెకు తీసుకుని ఉంటుండగా, సంపత్‌కుమార్ తన సోదరుడు సతీష్‌తో కలిసి చింతల్లో ఉంటున్నాడు. చింతల్నుంచి బేగంపేట దూరం కావడంతో పదిరోజుల క్రితం అంబర్‌నగర్‌లోని సంపత్ గదికి వచ్చి ఉంటున్నాడు. సోమవారం ఉదయం సంపత్ బంధువులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి మధ్యాహ్నం 1.30కి గదికి వచ్చాడు. గజ్వేలులో ఉంటున్న సంపత్ సోదరుడు 2.30కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి అదేప్రాంతంలో ఉంటున్న బాబాయ్ రాజును సంపత్ వద్దకు పంపాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో రాజుకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించారు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా సంపత్ చనిపోయి ఉన్నాడు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంపత్‌కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతిచెం దాడు. గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ డీఐ ఖాజామొయినుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మూడురోజుల్లో మెడికల్‌షాప్ ప్రారంభం.. మరో మూడురోజుల్లో గజ్వేల్‌లో మెడికల్‌షాపు ప్రారంభించేందుకు బిక్కుమళ్ల సంపత్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగావిలపిస్తున్నారు. ఏడాదికి రూ. 8 లక్షలకు మరో కంపెనీ ఆఫర్.... కొత్త సంపత్‌కుమార్‌కు మరో కంపెనీ నుంచి ఏడాదికి రూ. 8 లక్షల జీతంతో మంచి ఆఫర్ వచ్చింది. ఈనెల 25వ తేదీలోగా చేరాలంటూ ఆఫర్ లెటర్ అందింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు సతీష్కుమార్కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే కాగా తండ్రి శ్రీనివాస్ క్లాత్ మర్చంట్. మిస్టరీగా మారిన ఆత్మహత్యలు.... సంపత్, సంపత్‌కుమార్‌లు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ విద్యావంతులే. తమ ఫీల్డ్స్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆరాటపడేవాళ్లే. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడవలసిన ఆగత్యం ఏమోచ్చింది? తలుపులు లోపలకు వేసుకున్నారంటే ప్రాణాలు తీసుకునేందుకే అనేది స్పష్టం అవుతోంది. ఉదయం వరకు బంధువులతో షాపింగ్ చేసిన సంపత్ గదికి వచ్చిన తర్వాత స్నేహితునితో కలిసి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు గదిలో ఏం జరిగింది అనేది తెలియడంలేదు. ఇరువురు ఉపయోగించిన మూడు సెల్ఫోన్లు కాల్‌డేటా ఆధారంగా మిస్టరీని ఛేదించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, బిక్కుమళ్ల సంపత్ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు తన ఫోన్ నుంచి తన ఫోన్‌కే ఓ ఎస్ఎంఎస్ పంపుకున్నాడు. అందులో ‘ఇంట్లో గొడవలు తగ్గిపోవాలన్పది నా చివరి కోరిక.. మనీకి కాదు మనుషులకు విలువ ఇవ్వాలి’ అని ఉంది. -
పోరాటం ఆగదు విద్యుత్ జేఏసీ
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రత్నామ్నాయాలు, ప్యాకేజీలతో తమను మభ్యపెట్టలేరని విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాతూరు పవర్ ఆఫీస్ నుంచి టవర్‌క్లాక్ వరకు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం, ప్యాకేజీలిస్తాం, మీ బాధను పంచుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం దారుణమన్నారు. నిజంగా వారికి సీమాంధ్రులపై అంతటి మమకారం ఉంటే, ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సీమాంధ్రుల మనోభావాలను, వారి త్యాగాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రాతిబొమ్మలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతునివ్వడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఉద్యమం చేస్తున్నారని అభినందిస్తున్నారన్నారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వద్దకు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు చంద్రమోహన్, పద్మ, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, తులసీకృష్ణ, మేఘరాజు, రంగస్వామి, రంగయ్య, నాగరాజు, అక్రం, దాదాపీర్, ముత్తు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.