చిలకలగూడ, న్యూస్‌లైన్: కలిసి చదువుకున్న ఇరువురు స్నేహితులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వీరి మృతి మిస్టరీగా మారింది. చిలకలగూడ పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెదక్‌జిల్లా దౌలతాబాద్ మండలం రామసాగర్‌కు చెందిన చంద్రమౌళి కుమారుడు బిక్కుమళ్ల సంపత్ (27), నిజామాబాద్‌జిల్లా కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కొత్త సంపత్‌కుమార్ (27)లు నగరంలో ఎంబీఏ చదువుకున్నారు.
ఆ సమయంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. చదువు పూర్తయ్యాక సంపత్ మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, కంప్యూటర్ కోర్సులు చదవిన సంపత్‌కుమార్ బేగంపేటలోని సెల్యుజెనిక్ సంస్థలో స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు. వారాసిగూడ అంబర్‌నగర్‌లోని ముకుందం ఇంటి పెంట్‌హౌస్‌ను ఆరునెలల క్రితం సంపత్ అద్దెకు తీసుకుని ఉంటుండగా, సంపత్‌కుమార్ తన సోదరుడు సతీష్‌తో కలిసి చింతల్‌లో ఉంటున్నాడు. చింతల్‌నుంచి బేగంపేట దూరం కావడంతో పదిరోజుల క్రితం అంబర్‌నగర్‌లోని సంపత్ గదికి వచ్చి ఉంటున్నాడు.
సోమవారం ఉదయం సంపత్ బంధువులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి మధ్యాహ్నం 1.30కి గదికి వచ్చాడు. గజ్వేలులో ఉంటున్న సంపత్ సోదరుడు 2.30కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి అదేప్రాంతంలో ఉంటున్న బాబాయ్ రాజును సంపత్ వద్దకు పంపాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో రాజుకు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించారు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా సంపత్ చనిపోయి ఉన్నాడు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంపత్‌కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతిచెం దాడు. గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ డీఐ ఖాజామొయినుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మూడురోజుల్లో మెడికల్‌షాప్ ప్రారంభం..
మరో మూడురోజుల్లో గజ్వేల్‌లో మెడికల్‌షాపు ప్రారంభించేందుకు బిక్కుమళ్ల సంపత్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగావిలపిస్తున్నారు.
ఏడాదికి రూ. 8 లక్షలకు మరో కంపెనీ ఆఫర్....
కొత్త సంపత్‌కుమార్‌కు మరో కంపెనీ నుంచి ఏడాదికి రూ. 8 లక్షల జీతంతో మంచి ఆఫర్ వచ్చింది. ఈనెల 25వ తేదీలోగా చేరాలంటూ ఆఫర్ లెటర్ అందింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు సతీష్‌కుమార్‌కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే కాగా తండ్రి శ్రీనివాస్ క్లాత్ మర్చంట్.
మిస్టరీగా మారిన ఆత్మహత్యలు....
సంపత్, సంపత్‌కుమార్‌లు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ విద్యావంతులే. తమ ఫీల్డ్స్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆరాటపడేవాళ్లే. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడవలసిన ఆగత్యం ఏమోచ్చింది? తలుపులు లోపలకు వేసుకున్నారంటే ప్రాణాలు తీసుకునేందుకే అనేది స్పష్టం అవుతోంది. ఉదయం వరకు బంధువులతో షాపింగ్ చేసిన సంపత్ గదికి వచ్చిన తర్వాత స్నేహితునితో కలిసి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు గదిలో ఏం జరిగింది అనేది తెలియడంలేదు. ఇరువురు ఉపయోగించిన మూడు సెల్‌ఫోన్లు కాల్‌డేటా ఆధారంగా మిస్టరీని ఛేదించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, బిక్కుమళ్ల సంపత్ మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు తన ఫోన్ నుంచి తన ఫోన్‌కే ఓ ఎస్‌ఎంఎస్ పంపుకున్నాడు. అందులో ‘ఇంట్లో గొడవలు తగ్గిపోవాలన్పది నా చివరి కోరిక.. మనీకి కాదు మనుషులకు విలువ ఇవ్వాలి’ అని ఉంది.
ఇద్దరు మిత్రుల బలవన్మరణం
Published Tue, Dec 10 2013 4:24 AM | Last Updated on Sat, Aug 25 2018 6:09 PM
Advertisement