దుప్పటిలో ఎమ్మెల్యే తరలింపు
Published Sat, Apr 12 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు రెండు వేల అడుగుల ఎత్తుగల కొండపైకి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను దుప్పటిలో కూర్చోబెట్టి కర్రలతో అటవీవాసులు మోసుకెళ్లారు. వేలూరు జిల్లా వాణియంబాడి నియోజక వర్గం ఆలంగాయం యూనియన్ పరిధిలోని నెగ్నకొండ ఉంది. ఈ కొండపై 900 మందికి పైగా నివసిస్తున్నారు. మొత్తం 600 మంది ఓటర్లున్నారు. నిగ్నకొండకు వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి రోడ్డు వసతి మాత్రం ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో వానియంబాడి ఎమ్మెల్యే కోవై సంపత్‌కుమార్ ఆలంగాయం యూనియన్ పరిధిలో కరపత్రాలు అందజేశారు.
ఆ ప్రాంతంలో ఆలంగాయం సర్పంచ్ గోపాల్ నె గ్న కొండలో 600 ఓట్లు ఉన్నాయని అక్కడ ప్రచారం నిర్వహించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తన కాలికి గాయం కావడంతో అంత ఎత్తునకు నడవ లేనని చెప్పారు. దీంతో అటవీ ప్రాంత గ్రామస్తులు కర్రపై దుప్పట్టి కట్టుకొని అందులో ఎమ్మెల్యేను కూర్చోబెట్టి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతవాసులు మోసుకెళ్లారు. మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే నెగ్నకొండకు వెళ్లడంతో అటవీ ప్రాంతవాసులు సంతోషించారు. వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు సమస్యలను వివరించారు.
Advertisement