సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్షలు రెండో రోజు గురువారం కొనసాగాయి. జిల్లాలో 10 నియోజకవర్గాల పరిధిలోని 12 మంది సమన్వయకర్తలతోపాటు పలువురు నేతలు ఆమరణ నిరాహారదీక్షలు కొనసాగించారు. వీరికి మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ నేతలకు సంఘీభావం ప్రకటించగా, కోవూరు ఎమ్మెల్యే
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 120 కార్లతో నార్తురాజుపాళెం నుంచి ర్యాలీగా బయల్దేరి గురువారం జిల్లావ్యాప్తంగా పర్యటించి దీక్ష చేస్తున్న నేతలకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గాంధీబొమ్మ సెంటర్‌లో పార్టీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలు రెండో రోజూ కొనసాగాయి.
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గురువారం వీరి దీక్షా శిబిరాలకు వచ్చి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరీగ మురళీధర్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పిన విధంగా పాలకులు నడచుకోవాలన్నారు. రాష్ట్రం లో 8 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 6 కోట్ల వరకు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారన్నారు.
గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, బాలచెన్నయ్య, నాయకుడు బత్తిని విజయ్‌కుమార్‌లు చేపడుతున్న నిరవధిక దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బండ్లమూడి అనిత తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వస్తున్నదనే సమాచారంతో వైఎస్సార్‌సీపీ నేత నాశిన నాగులు ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలు కొనసాగాయి. వీరికి బండ్లమూడి అనిత, స్టీరింగ్‌కమిటీ సభ్యుడు శంకర్‌రాజు, మండల కన్వీనర్లు కృష్ణారెడ్డి, వీరారెడ్డి, రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, శింగం శెట్టి భాస్కర్‌రావు తదితరులు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేపట్టిన దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెలవల సుబ్రమణ్యం ఆమరణ నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు.ఉదయగిరిలో ఎమ్మె ల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సందర్శించి మేకపాటికి సంఘీభావం ప్రకటించారు.
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, చేజర్ల మండలం మడపల్లి సర్పంచ్ ఇ.నారాయణ, తోడేటి పెంచలయ్య, ఇందూరు శేషారెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని నార్తురాజుపాళెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కొడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు మండల కన్వీనర్లు ఆమరణదీక్షలను కొనసాగించారు. వీరికి మద్దతుగా పలువురు సర్పంచ్‌లు గురువారం రిలేదీక్షలను కొనసాగించారు.