ఏబీవీపీ దీక్షలో ఉద్రిక్తత
-
ధర్నా చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు
-
అంబేడ్కర్ విగ్రంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం
-
సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి, ఆస్పత్రి తరలింపు
-
వీసీ హామీతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, సురేంద్రరెడ్డి
నెల్లూరు(టౌన్) : వీఎస్‌యూను నూతన భవనంలోకి తరలించడంతో పాటు వీసీ వీరయ్య, రిజిస్ట్రార్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలని ఏబీవీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష గురువారానికి మూడోరోజుకు చేరడంతో. వీఎస్‌యూ కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు వీఆర్సీ కూడలిలో ధర్నా నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలచిపోయాయి. 1వ పట్టణ ఎస్‌ఐ గిరిబాబు వచ్చి దీక్ష విరమించాలని కోరారు. దీక్ష విరమించేది లేదని చెప్పడంతో గిరిబాబు ధర్నా చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో ఏబీవీపీ నాయకులిద్దరు ఆగ్రహాంతో పెట్రోలు బాటిళ్లతో ఆంబేడ్కర్ విగ్రహంపైకి ఎక్కి ఆత్మహాత్యాయత్నానికి ప్రయత్నించారు. కాగా దీక్షలో కూర్చున్న కౌషిక్ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే హుటావుటిన జయభారత్ ఆస్పత్రి తరలించారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
నాయకుల అరెస్టు
నగర డీఎస్పీ వెంకటరాముడు సంఘటన స్థలానికి చేరుకుని ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను దీక్ష విరమించాలని కోరగా వారు వీసీ వచ్చి హామీ ఇస్తేనే చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డిలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డీఎస్సీతో మాట్లాడి విద్యార్థులను విడిపించారు. డీఎస్సీ వీసీ వీరయ్యకు సమాచారం అందించి పిలిపించారు. ఈ సందర్భంగా వీసీ వీరయ్య మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో వర్సిటీని నూతన భవనంలోకి మార్చుతామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రార్‌పై విచారణ జరిపించాలని గతంలోనే సీబీఐకి లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వీసీ వీరయ్యపై మండిపడ్డారు. గతంలో కూడా ఇదే మాటా చెప్పారని ఇప్పటి వరకు లేఖ రాయలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో అందుకు సంబంధించి కాపీలను విద్యార్థులకు అందజేస్తామని వీసీ చెప్పారు. ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఏబీపీవీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షవిరమింపజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ దీక్ష చేపడతామని హెచ్చరించారు.