వీఎస్‌యూలో ఉద్రిక్తత
నెల్లూరు(టౌన్/క్రైమ్): విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దర్గామిట్టలోని వర్సిటీ పరిపాలన భవనం వద్ద బైఠాయించారు. ఏబీవీపీ నేత ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఉద్యోగాల భర్తీలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఈశ్వ ర్ ఆరోపించారు. వైస్ చాన్స్‌లర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ నాగేంద్రప్రసాద్ గేటు వద్దకు వచ్చారు.
ఒక్క నిమిషం తనకు అవకాశం ఇస్తే ఆరోపణలపై వివరణ ఇస్తానని తెలిపారు. రిజిస్ట్రార్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన లోనికి వెళ్లిపోయారు. ఇంతలో ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ గేట్లు తోసుకుని పరిపాలన భవనంలోని వీసీ చాంబర్ వద్దకు పరుగెత్తారు. వీరిని పోలీసులకు కూడా నిలువరించలేకపోయారు. ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు విచారణకు సిద్ధపడలేదంటూ ఒక్కసారిగా వీసీ చాంబర్ వద్ద ఉన్న ఫర్నిచర్‌ను ధ్వం సం చేయడంతో పాటు అద్దాలు పగులగొట్టారు. దీం తో ఒక్కసారిగా ఉద్యోగులు భయభ్రాంతులకు లోనయ్యారు. రిజిస్ట్రార్‌తో సహా పలువురు ఉద్యోగులు త మ గదులకు పరిమితమయ్యారు.
భద్రత కల్పించేం దుకు వచ్చిన ముగ్గురు పోలీసులు కార్యకర్తలను ఆపలేకపోయారు. సమాచారం అందుకున్న ఒకటో నగర సీఐ మద్ది శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడకు చేరుకునే లోపే ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఆ సమయంలో కార్యాలయంలో వీసీ రాజారామిరెడ్డి లేరు. ఈ ఘటన జరిగిన కొంతసేపటికి తేరుకున్న వర్సిటీ సిబ్బంది గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఏబీవీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలపై ఒకటో నగర పోలీసులు కేసు నమోదు చేశారు.