అక్రమార్కులు సమైక్యాంధ్ర సమ్మెనూ వదల్లేదు. ఆ పేరుతో సొమ్ము చేసుకున్నారు. ఎంచక్కా రేషన్ బియ్యం, కిరోసిన్‌లను డీలర్లు అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. కంచే చేనుమేసినట్లుగా.. అడ్డుకోవాల్సిన అధికారులే దగ్గరుండి సహకరించారు. అక్టోబర్ కోటా సరుకుల కోసం చౌకదుకాణాల వద్దకు వెళ్లిన నిరుపేదలను పలు గ్రామాల్లో ‘సమ్మె వల్ల ఈ నెల సరుకు రాలేదు’ అంటూ డీలర్లు వెనక్కు పంపారు.
కొండాపురం, న్యూస్‌లైన్ : నిరుపేదలను రేషన్‌డీలర్లు, అధికారులు ఏమార్చారు. కొండాపురం మండలంలోని పలు రేషన్‌దుకాణాల్లో అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం, కిరోసిన్ పేదలకు అందలేదు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై పక్కదారి పట్టించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్లపల్లి, లింగనపాలెం, కొమ్మి-1, సత్యవోలు, కుంకువారిపాలెం, అగ్రహారం గ్రామాల్లోని రేషన్‌షాపుల పరిధిలో ఇలా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఆరు దుకాణాల్లో కలిపి 1610 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 17,308 కిలోల పీడీఎస్ బియ్యం, అంత్యోదయ లబ్ధిదారులకు 3,080కిలోల బియ్యం, 3145 లీటర్ల కిరోసిన్ ఇస్తారు. వింజమూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సరకులు ఆయా షాపులకు వెళ్తాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఈ ఆరు దుకాణాల సురుకులను అధికారులు, డీలర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై గ్రామాల్లో డీలర్లను ప్రజలు ప్రశ్నిస్తే తుపాను, సమైక్యాంధ్ర సమ్మెల వల్ల సరుకులు రాలేదని జవాబు ఇస్తూ తప్పించుకుంటున్నారు.
సహకరించని దుకాణాలపై దాడులు
మండలంలో 34 రేషన్‌షాపులు ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సరుకులు నల్లబజారులో అమ్ముకోవాలని, అందుకుగాను షాపునకు రూ.పదివేలు చొప్పున తమకు ఇవ్వాలని మండలానికి చెందిన ఓ అధికారి డీలర్లను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారికి భయపడిన ఆరుగురు డీలర్లు సరుకులను పక్కదారి పట్టించినట్లు సమాచారం. అతడి మాట వినని డీలర్ల షాపులపై దాడులు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా గొట్టిగొండాల-2 షాపుపై దాడిచేసి సొమ్ముచేసుకోవడం ఈ కోవకే చెందినదని సమాచారం. అధికారి మాట విననందుకు తమ షాపులపై దాడులు చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు.
సమ్మె పేరుతో చేతివాటం
Published Thu, Nov 7 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement