సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందా? ఢిల్లీలో ఏపీ భవన్‌లో చంద్రబాబు చేపట్టిన దీక్షలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించకపోవడంపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులే జీర్ణించుకోలేకపోతున్నారా? వేర్పాటువాదం చేస్తోన్న టీడీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోండటంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగు బయటపెట్టేందుకే సాహసించడం లేదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు, టీడీపీ శ్రేణులు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నింది. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కయ్యారు.
కాంగ్రెస్ అధిష్టానం కనుసైగల మేరకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆధారంగా జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం.. ఆ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ఈనెల 3న యధాతథంగా ఆమోదించిన విషయం విదితమే. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదించిన క్షణాల్లో ‘అనంత’లో సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇది దావానంలా సీమాంధ్రకు వ్యాపించింది.
పస్తుతం మహోగ్ర రూపం సంతరించుకున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని ప్రజానీకం మండిపడుతోంది. వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తోండటంతో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీదీ అదే పరిస్థితి. రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు కన్పిస్తే చాలు.. వెంటబడి తరముతున్నారు. మూడు రోజుల క్రితం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలను అనంతపురంలో సమైక్యవాదులు వెంటపడి తరమడమే అందుకు తార్కాణం. ప్రజా వ్యతిరేకత దెబ్బకు చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ జెండాను చేబూనలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా రాజీనామా బాట పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఏపీ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షలో సమైక్యవాదం విన్పించకుండా వేర్పాటువాదాన్నే పునరుద్ఘాటించడంపై ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది.
జిల్లాలో సమైక్యవాదాన్ని గట్టిగా విన్పించే ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంగళవారం ఢిల్లీలో చంద్రబాబుకు మద్దతు పలికి.. ఆయన విధానమే సరైనదని సమర్థించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వేర్పాటువాదాన్ని సమర్థించిన పయ్యావుల కేశవ్‌కు సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టే అర్హత లేదని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవడం.. సమైక్య సెంటిమెంటు ప్రజల్లో బలీయంగా నాటుకుపోవడం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టి వేర్పాటువాదాన్ని విన్పించడం జిల్లాలో టీడీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షతో టీడీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మంగళవారం తనను కలిసిన కార్యకర్తలతో వ్యాఖ్యానించడం గమనార్హం. అధినేత వేర్పాటువాదం చేస్తూ.. శ్రేణులు సమైక్యవాదం విన్పిస్తే ప్రజల్లో టీడీపీ అపహాస్యం పాలవుతుందని ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన వేర్పాటువాద దీక్షతో టీడీపీ జెండాలతో సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టలేని దుస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ్ముళ్ల బెంబేలు
Published Wed, Oct 9 2013 2:26 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement