సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు,
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని రగిలిస్తున్నారు. అలాగే ఉద్యమ ఆవశ్యకతపై చైతన్యవంతం చేస్తూ నియోజకవర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో మందలూరు గ్రామానికి చెందిన రైతులు సమైక్యవాణి వినిపించారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మండల కన్వీనర్ చిన్నవీరన్న ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఆత్మకూరులో ఏరువా రామచంద్రారెడ్డి, డోన్‌లో ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో నల్లమేకలపల్లె వాసులు కూర్చున్నారు.
డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు ఆపబోమని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కౌతాళం మండలం కంబళనూరు క్యాంప్‌నకు చెందిన కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. అలాగే నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శాతనకోట గ్రామానికి చెందిన 30 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్ని సమైక్య నినాదాలు చేశారు. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్‌లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి.