జిల్లాలో సివిల్ సప్లయీస్‌కు సంబంధించిన 15 మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సంబంధిత ఇన్‌చార్జిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతం హెచ్చరించారు.
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సివిల్ సప్లయీస్‌కు సంబంధించిన 15 మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సంబంధిత ఇన్‌చార్జిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతం హెచ్చరించారు. గోడౌన్‌లో సరుకుల రవాణాకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని శనివారం సాక్షి లో ‘అడిగేవారు లేరు.. దోచేద్దాం!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జాయింట్ కలెక్టర్ స్పందించారు. సివిల్ సప్లయీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు సరఫరా అయ్యే సరుకులకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కాటా ద్వారా వేమెంట్ వేసి డీలర్లకు అప్పగించాలని సూచించారు.
ఈ నిబంధనలు పాటించని గోడౌన్ ఇన్‌చార్జిలను సస్పెండ్ చేస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నగర శివారు కొత్తూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను ఆయన సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌లోని సరుకుల నిల్వ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్ల వద్ద తూకాలు వేసి సరుకులు ఇవ్వకపోవడంతో డీల ర్లు, అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు.
గోడౌన్ల వద్ద తూకాలు వేసి సరుకులు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీలర్ల కు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సరుకులను ఈనెల 30 తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొ త్తూరు స్టాక్ పాయింట్‌కు పామాయిల్ సత్వరమే సరఫరా చే యాలని సివిల్ సప్లయీస్ డీఎంను ఆదేశించారు. రేషన్‌షాపుల డీలర్లు త్వరితగతిన డీడీలు కట్టాలన్నారు. కొత్తూరు గోడౌన్‌లో రెండు నెలలకు సంబంధించి చక్కెర నిల్వల్లో ఉన్న తేడాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారుల ను ఆదేశించారు. సివిల్ సప్లయీస్ డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీ
వాకాడు: వాకాడులోని పౌరసరఫరాల గిడ్డంగిని శనివారం ఆ శాఖ వి జిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అ నంతరం గిడ్డంగిలో ని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డీఎం ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 15పౌరసరఫరాల గిడ్డంగులున్నాయన్నారు. అందులో పదింటికి సొంత భవనాలు ఉ న్నాయని, మరో 5 గిడ్డంగులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. అయితే జిల్లాలో ఎక్కడా అవకతవకలు జరగకుండా అరికట్టేందుకు తమ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ పరిశీలనలో ఎలాంటి అవకతవకలు లేవని ఆయన అన్నారు. ఈయన వెంట అసిస్టెంట్ మేనేజర్ పుల్లంశె ట్టి, డీటీ మాధవరావు ఉన్నారు.