సాక్షి, అనంతపురం : సమైక్యమే లక్ష్యమంటూ ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. లక్ష్యాన్ని చేరుకునే దాకా పోరు ఆపబోమని స్పష్టీకరిస్తున్నారు. 81 రోజులైనా అదే ఉత్సాహం, ఊపుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఉద్యోగులు, ఎన్‌జీఓలు, ఉపాధ్యాయులు సమ్మె విరమించి విధుల్లో చేరిపోయినా.. ప్రజలు మాత్రం ఉద్యమబాట వీడడం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుండడంతో మొక్కవోని దీక్షతో సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా సమైక్యవాదులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాన్ని కొనసాగించారు. అనంతపురం నగరంలో సర్పంచులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్, వాణిజ్యపన్నుల శాఖ, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి నాయకుడు పరశురాం నాయక్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రిజిస్ట్రార్ గోవిందప్ప సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
బత్తలపల్లిలో రోడ్డుపై చదువుతూ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ర్యాలీ చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టి.. మానవహారాలు నిర్మిం చారు. రాయదుర్గంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ‘మహాత్మా.. నీవైనా రాష్ట్రాన్ని కాపాడు’ అంటూ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, గంట పాటు రాస్తారోకో చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు ఫుట్‌పాత్‌పై ఇంటి సామగ్రి అమ్మి నిరసన తెలిపారు. రాప్తాడులో విద్యార్థులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి.
సడలని దీక్ష
Published Sun, Oct 20 2013 3:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement