నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. అయితే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగులు రహస్యంగా పనులు చేసి సొమ్ము దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా 37 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆ సంస్థ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఏపీఎన్‌జీఓలతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగ కూడదనే ఉద్దేశంతో శానిటేషన్, మంచినీరు, వీధిలైట్లకు సంబంధించి మాత్రమే ఉద్యోగులు పనిచేయాల్సి ఉంది. కార్పొరేషన్‌లో అడుగడుగునా అవినీతిమయం కావడంతో ఇక్కడి ఉద్యోగుల్లో కొందరు అత్యవసర పనులు కాకుండా ఇతర వాటికి సంబంధించి రహస్యంగా చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే సమ్మె ఉంటే మాకేంటి? మాపని మాది అని దురుసుగా సమాధానమిస్తున్నారు. సమ్మెను కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు తమకు అనుకూలంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. రహస్యంగా కాంట్రాక్టర్ల సేవలో తరిస్తూ వివిధ పనులకు సంబంధించిన బిల్లులను తయారు చేసి వారి నుంచి అధిక మొత్తంలో లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సమ్మె ప్రారంభమైన మొదట్లో ఈ తతంగమంతా రాత్రివేళలో జరిగేది. ప్రస్తుతం వారంతా తమను ఎవరు ఏమీ అడగరని, ఎలాంటి ఇబ్బందులు లేవనుకుని పగలు కూడా అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో ఉన్న ఉద్యోగులంతా వీరు తీరుపై మండిపడుతున్నారు. తామంతా జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు మాత్రం అక్రమంగా సంపాదించుకునేందుకు ఇలా చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు రికార్డుల్లో సంతకాలు చేయకుండానే అనధికారికంగా విధులు నిర్వరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగమంతా అధికారపార్టీ నేతల ప్రోత్సాహంతోనే జరుగుతుందనే విమర్శలున్నాయి.
నగర, రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ మరోవైపు రోడ్లు, కాలువల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులనే ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ సిబ్బందితో చేసిపెడుతూ పని కానిచ్చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు అత్యవసర సేవలు మినహా అనధికారికంగా, రహస్యంగా ఇతర పనులు చేస్తున్న వాటిని నిలిపివేసి సంబంధిత ఉద్యోగులను సమ్మెలో పాల్గొనేటట్టు చూస్తే బాగుంటుందని ఆ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
సమ్మెలో.. సడేమియా
Published Fri, Sep 20 2013 3:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement