సమైక్యాంధ్రసాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్ స్టేడియంలో
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రసాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్ స్టేడియంలో జరగనున్న సమైక్యశంఖారావం సభను విజయవంతం చేయూలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరుకావాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంను విభజించేందుకే కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతోందన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీగా మొదటి నుంచి మద్దతు ఇస్తున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగన్ మోహన్‌రెడ్డి రెండు సార్లు ఆమరణదీక్ష చేపట్టిన విషయూన్ని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్‌మోహనరెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కోరారు.
పార్టీనేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమతీరు చూస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే ధ్యేయంగా రాజకీయలబ్ధి పొందేం దుకు ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా ఒకేఒక్కరు పోరాడుతున్నారని, జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటిస్తున్నారన్నారు. తెలుగుజాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటమే సమైక్య శంఖారావసభని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.