సిక్కోలు సమరోత్సాహం | today Ys Jagan Mohan Reddy Samaikya Shankaravam in srikakulam | Sakshi
Sakshi News home page

సిక్కోలు సమరోత్సాహం

Published Sun, Feb 9 2014 4:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

సిక్కోలు సమరోత్సాహం - Sakshi

సిక్కోలు సమరోత్సాహం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు శ్రీకాకుళం సర్వసన్నద్ధమైంది. ఢిల్లీ పెద్దల అహంకారంపై  తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తెలుగు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్‌కు జిల్లా బాసటగా నిలవనుంది. ఆయన హోరెత్తిస్తున్న  సమైక్యాంధ్ర నినాదానికి జిల్లా ప్రజానీకం సంఘీభావం ప్రకటించనుంది. అందుకోసం జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది తరలిరానున్నారు. శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో కీలక ప్రజాప్రతినిధులు, అనుయాయులతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ చారిత్రక రాజకీయ ఘట్టానికి సిక్కోలు సర్వసన్నద్ధమై సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. 
 
 ప్రతిధ్వనించనున్న ‘సమైక్య’ వాణి 
 సిక్కోలు వేదికగా సమైక్యాంధ్ర నినాదం ప్రతిధ్వనించనుంది. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి భారీస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కాంక్షించే ప్రజానీకం తరలిరానున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో వివిధ వాహనాలను సిద్ధం చేసుకున్నారు.  బహిరంగ సభ నిర్వహించనున్న ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంతోపాటు శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతస్థాయిలో జనం తరలిరావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర భావనను ప్రతిబింబించే రీతిలో శ్రీకాకుళం జనంతో కిటకిటలాడనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే  వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర స్ఫూర్తి వెల్లివిరిసేలా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
 
 భారీ అనుచరగణంతో పార్టీలో చేరనున్న ధర్మాన
 సమైక్య శంఖారావం సభలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో అనుయాయులతోమ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో  చేరనున్నారు. తన అనుయాయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన పార్టీలో చేరుతారు. జిల్లాలో కాం గ్రెస్ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే రీతిలో చేరికలకు ధర్మాన రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇతర కీలక కాంగ్రెస్, టీడీపీనేతలు ఆయనతోపాటు సుమారు వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.  ఆదివారం పార్టీలో చేరనున్న నేతలు, కార్యకర్తల కోసం బహిరంగ సభ నిర్వహించే మైదానంలో ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని కేటాయించడం విశేషం. బహిరంగ సభలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరుకానున్నారు.
 
 భారీ ర్యాలీ 
 జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆయన శ్రీకాకుళం సింహద్వారం వద్దకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభిస్తారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చే మోటారుబైక్‌లతో ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీకి ముందుగా ఓపెన్‌టాప్ వాహనంపై కళా బృందాల ప్రదర్శన ఉంటుంది. సింహద్వారం వద్ద ప్రారంభమయ్యే భారీ ర్యాలీ కొత్తబ్రిడ్జి, డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్డు మీదుగా బహిరంగ సభ జరిగే మున్పిపల్ పాఠశాల మైదానానికి చేరుకుంటుంది. ర్యాలీ సాగే దారి పొడుగునా మహిళలు, విద్యార్థులు జగన్‌కు స్వాగతం పలకనున్నారు. 
 
 సర్వాంగ సుందరంగా మైదానం
 ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగన్‌కు ఉన్న విశేష ప్రజాదారణకు అద్దం పట్టేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలిరానున్న ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానంలో  30ఁ 60 సైజుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. పాల్గొనేవారందరికీ జగన్ బాగా  కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమైక్య శంఖారావం పేరిట భారీ ఫ్లెక్సీని వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఏర్పాటు చేస్తున్నారు. మైదానమంతా జగన్ ఫ్లెక్సీలతో అలంకరించారు. సభాస్థలి వద్ద గాలిలో బెలూన్లు కూడా ఎగురవేయనున్నారు. ఇక మైదానంలో చోటులేక బయట నిలిచిపోయ వేలాదిమంది సైతం బహిరంగ సభను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కూడలి, రేమండ్స్ షోరూం, పాతబస్టాండ్, పాత బ్రిడ్జిల వద్ద పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి బహిరంగ సభను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మైదానంలో ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపుగా జనం బయట ఉండే అవకాశం ఉన్నందున ఎవరూ నిరుత్సాహపడకుండా ఈ ఏర్పాటు చేశారు.  
 
 సమైక్య శక్తిని చాటాలి: కృష్ణదాస్ 
 సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పేలా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు సమైక్యాంధ్ర కాంక్షించే వారంతా వై.ఎస్.జగన్ చేస్తున్న పోరాటానికి బాసటగా నిలవాలన్నారు. అందుకోసం శ్రీకాకుళంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement