సమైక్య శంఖారావం సభకు ఏర్పాట్లు పూర్తి
Published Sun, Feb 9 2014 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద గల ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనే సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మైదానంలో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావుల భారీ హోర్డింగ్ పలువురి ఆకర్షిస్తోంది. పార్టీలో చేరనున్న ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకోసం, యువత కోసం వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఫ్లెక్సీలతో కళకళ
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఆదివారం జిల్లాకు రానుండడంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. పట్టణంలోని పాలకొండ రోడ్డు నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో రోడ్లన్నీ కలకలలాడుతున్నాయి. పట్టణంలోని వివిధ కూడళ్ళ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను, పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభ జిల్లా నుంచే ప్రారంభం కావడంతో బహిరంగ సభ కోసం మున్సిపల్ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భారీ ఎత్తున హోర్డింగ్‌లు, కటౌట్లు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.
శోభాయమానంగా వైఎస్ విగ్రహం
సమైక్య శంఖారావం సభ సందర్భంగా శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించారు. బహిరంగ సభకు ముందు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్‌మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించనుండడంతో విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
పర్యవేక్షించిన ధర్మాన
మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు పార్టీలో చేరుతుండడంతో జగన్‌మోహన్‌రెడ్డి, ధర్మానతో కూడిన భారీ ఫ్లెక్సీలను రోడ్డు పొడవునా ఏర్పాటు చేశారు. ధర్మానతో పాటు పట్టణంలోని ద్వితీయ శ్రేణి కేడరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరుతుండడంతో పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద నాయకులు, ధర్మాన అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. బహిరంగ సభ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ధర్మాన ప్రసాదరావు పరిశీలించారు. శనివారం సభాస్థలికి వచ్చిన ఆయన నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నాయకులు, ధర్మాన అనుచరులు కూడా సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు.
వాహనాల పార్కింగ్ ఎక్కడంటే..
శ్రీకాకుళం క్రైం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభకు వచ్చే వాహనాలకు పలు పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలి పారు. కొత్తబ్రిడ్జి మీదుగా అంబేద్కర్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ వరకు, పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎటువంటి భారీ, నాలుగు చక్రాల వాహనాలు అనుమతించరని తెలిపారు.
ఎచ్చెర్ల, పొందూరు వైపు నుంచి వచ్చే వాహనాలు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు మీదుగా వచ్చి లక్ష్మీటాకీస్ దగ్గరలో వాహనాలు పార్కింగ్ చేసుకొని పాతబ్రిడ్జి వద్దగల కాజ్‌వేపై నుంచి రావాలి.
ఆమదాలవలస వైపు నుంచి వచ్చే వాహనాలు పెదపాడు రోడ్డు మీదుగా, రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో గానీ, రిమ్స్ ఆస్పత్రి మీదుగా ఆర్ట్స్ కళాశాల రోడ్డులో కానీ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
నరసన్నపేట వైపు నుంచి హైవే మీదుగా వచ్చే వాహనాలు రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్ మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
గార, ఒప్పంగి వైపు నుంచి వచ్చే వాహనాలు అరసవల్లి మీదుగా వచ్చి 80 అడుగుల రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయాలి.
వేలాది వాహనాలతో ర్యాలీ
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలోని ఎన్టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను అధిక సంఖ్యలో ప్రజలు, ధర్మాన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ధర్మాన అనుచరుడు మామిడి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని నాగావళి హోటల్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రానున్నారని తెలిపారు. పట్టణ ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలకనున్నామని, 500 మోటార్ బైక్‌లు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్ మీదుగా సభాస్థలికి జగన్‌మోహన్ రెడ్డి చేరుకుంటారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు సుమారు 1000 మంది వరకూ వైఎస్సార్‌సీపీలో చేరతారని తెలిపారు. సమావేశంలో ధర్మాన రాంమనోహర్‌నాయుడు, కోణార్క్ శ్రీను, కిల్లి వెంకట సత్యనారాయణ, మండవిల్లి రవి, గుడ్ల మోహనరావు, పొన్నాడ రుషి, మట్ట శ్రీధర్ పాల్గొన్నారు.
Advertisement