సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ ఉద్యమ కెరటం ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరాలన్న దృఢ సంకల్పం ఉద్యమకారుల్లో బలంగా కన్పిస్తోంది. అందుకే వారు రోజులు గడుస్తున్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం 91వ రోజు జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమించారు. అనంతపురం నగరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ చేశారు. స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో విద్యార్థి నాయకులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగాయి.
ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంతకల్లులో రిలేదీక్షలు కొనసాగాయి. పామిడిలో మౌనదీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘శాడిస్టు సోనియా, యూపీఏ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక సద్భావన సర్కిల్‌లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
కదిరిలో ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వేమారెడ్డి కూడలిలో మానవహారం నిర్మించి... సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమం 91 రోజులకు చేరుకున్న సందర్భంగా విద్యార్థులు 91 ఆకారంలో కూర్చున్నారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు పాఠశాల ఆటస్థలాన్ని శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు.
సమైక్య హోరు
Published Wed, Oct 30 2013 3:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement