అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని జిల్లా వాసులు నినదిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కదం తొక్కడంతో 42వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు ఇప్పటికీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు నిరవధికంగా మూతబడ్డాయి. దీంతో పాలన స్తంభించిపోయింది. అనంతపురం నగరంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా ముస్లింలు కదంతొక్కారు. టవర్‌క్లాక్ సమీపంలో రిలే దీక్షలకు కూర్చున్నారు. జాక్టో ఆధ్వర్యంలో స్థానిక యోగి వేమన విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. చెడు చూడకు... చెడు వినకు... చెడు మాట్లాడకు అంటూ... వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ జేఏసీ, ఎన్‌జీవోలు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్కేయూ వద్ద విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పదవులే పరమావధిగా భావిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరిని నిరసిస్తూ పుట్టపర్తి జేఏసీ నేతలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా పౌరుషం తెచ్చుకోండంటూ చీర, సారె పోస్టు ద్వారా పంపారు. మరికొందరు జేఏసీ నేతలు మొండెం దాకా ఇసుకలో పూడ్చుకుని నిరసన తెలిపారు. సమైక్యవాదులు వినాయకునికి వినతి పత్రం సమర్పించారు.
అమడగూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుక్కపట్నంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. గుంతకల్లులో ఎన్‌జీవో, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ కార్మికులు రాస్తారోకో చేశారు. కదిరిలో వయోజన విద్య సిబ్బంది రిలే దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తుఫాన్ చిత్రప్రదర్శనను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. మడకశిరలో జేఏసీ నాయకులు నోటికి నల్ల బట్ట కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నడుముకు ఆకులు, గడ్డి కట్టుకుని నిరసన తెలిపారు. అమరాపురం, రొద్దంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నడుముకు ఆకులు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండ, సోమందేపల్లిలో న్యాయవాదులు గణనాథునికి వినతిపత్రం అందజేశారు.
గోరంట్లలో జేఏసీ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ధర్మవరంలో ఎన్‌జీవో, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో జేఏసీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో రైతులు, సమైక్యవాదులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎన్‌జీవో, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నాటిక ప్రదర్శించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ తాలూకా కన్వీనర్ నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కణేకల్లులో మత్య్స కార్మికులు బంద్ చేపట్టారు. కణేకల్లులో యువకులు రిలేదీక్ష చేపట్టారు. రాప్తాడులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రిలో ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి.
పోలీసుస్టేషన్ సర్కిల్లో జేఏసీ నేతలు మానవహారం నిర్మించారు. పెద్దవడుగూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. కూడేరులో ఆటోడ్రైవర్లు టవరెక్కి నిరసన తెలిపారు. ఉరవకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని జేఏసీ నేతలు ఉరవకొండలో వినాయకునికి వినతి పత్రం సమర్పించారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటనతో తీవ్ర వేదనకు గురై అగళి మండలం రామనపల్లికి చెందిన చంద్ర(45), ఆర్‌జీపల్లికి చెందిన రామచంద్రప్ప (45), రొళ్ల మండలం కొడగార్లగుట్టకు చెందిన నవీన్‌కుమార్ (28) గుండెపోటుతో తనువు చాలించారు.
ప్రజోద్యమం
Published Wed, Sep 11 2013 4:17 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement