రగులుతున్న జ్వాల | united state agitation become severe | Sakshi
Sakshi News home page

రగులుతున్న జ్వాల

Published Sat, Sep 28 2013 2:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

united state agitation become severe

 సాక్షి, అనంతపురం :  సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాల ప్రజ్వరిల్లుతూనే ఉంది. 59 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం స్పందించక పోవడంపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటిచెబుతున్నారు. ఫలితంగా శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఎగిసిపడింది. సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాత్రంతా ఆట పాటలతో జాగరణ చేశారు.
 
 ఎమ్మార్పీఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి... సమైక్య నినాదాన్ని విన్పించారు. సమైక్య వాదులకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు మద్దతు ప్రకటించి... రాగిముద్ద, చట్నీ వడ్డించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గీతామందిరంలో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ సద్భావన సదస్సులో సమైక్యవాణిని గట్టిగా వినిపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రిలేదీక్షలు చేస్తున్న మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు.. సంఘీభావం తెలిపారు.
 
 రాష్ట్రం విడిపోతే నీటి కష్టాలు తప్పవంటూ కార్పొరేషన్ ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఖాళీ కుండలతో ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఎస్కేయూలో జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులను మూసివేయించారు. ఆకుతోటపల్లి మహిళలు, వర్సిటీ జేఏసీ నాయకులు స్థానిక 205 జాతీయ రహదారిపై ర్యాలీ, రాస్తారోకో చేశారు. ధర్మవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. సమైక్యవాదులు ‘అత్తారింటికి దారేది’  సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బత్తలపల్లిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. ముదిగుబ్బలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. గుంతకల్లులో జేఏసీ నాయకులు గొర్రెల కాపరుల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమ రాళ్ల సీమగా మారుతుందంటూ హిందూపురంలో జేఏసీ నాయకులు తోపుడుబండ్లపై రాళ్లు పెట్టుకుని ర్యాలీ చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రోడ్లపై రాళ్లు కొడుతూ నిరసన తెలిపారు. ఏపీఎన్‌జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను ముట్టడించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు ఖాళీ కుర్చీలను మోస్తూ ర్యాలీ చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ఎన్‌పీకుంట మండల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. సాధన స్కూలు విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. తలుపులలో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో వడ్డెర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉద్యమంలో కలసి రాకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు బుద్ధి చెబుతామంటూ జేఏసీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
 
 మడకశిర, అమరాపురం, రొళ్లలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను బంద్ చేశారు. మడకశిరలో ఉద్యోగులు కోట బురుజు ఎక్కి, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకుని నిరసన తెలిపారు. గుడిబండలో ఆర్టీసీ ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ఆటా పాట నిర్వహించారు. పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రామ్ వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు చెబుతూ, బుక్కపట్నంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు పెనుకొండలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. పరిగిలో బఠానీలు అమ్ముతూ నిరసన తెలిపారు. గోరంట్ల, రొద్దం మండలాల్లో సమైక్యవాదులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో మెడికల్ షాపు నిర్వాహకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు.
 
 జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. కణేకల్లులో బారిక కులస్తులు భారీ ర్యాలీ చేశారు. రాప్తాడులో ఉపాధ్యాయులు రాస్తారోకో, శింగనమలలో జేఏసీ నాయకులు ర్యాలీ, నార్పలలో మహిళలు మౌనదీక్ష, తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి చేపట్టారు. పెద్దవడుగూరులో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులు రూ.10 వేల విరాళం అందజేశారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దర్గాలో ప్రార్థనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. కూడేరులో విద్యార్థులు రాస్తారోకో, బెళుగుప్పలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement