సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సమైక్యవాదులు 70 రోజులుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. ప్రజలకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నా, వ్యాపారులు నష్టపోతున్నా, వేతనాలు రాక ఉద్యోగులు అవస్థ పడుతున్నా ఉద్యమ పంథాను మాత్రం వీడడం లేదు. కేంద్రం దిగొచ్చేదాకా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉద్యమ పిడికిలిని దించబోమని స్పష్టం చేస్తున్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది.
మరోవైపు ‘ఎన్ని కుట్రలైనా చేయండి.. ఉద్యమాన్ని నిర్వీర్యపర్చండి’ అంటూ కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు ఆ పార్టీల నాయకులకు నూరిపోస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులను, ఉద్యమకారులను టార్గెట్ చేయాలని, జేఏసీల మధ్య చిచ్చుపెట్టాలని సూచిస్తున్నాయి. ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సైతం తమ అనుచరులను రంగంలోకి దింపి ఉద్యమకారులపై దాడులు చేయిస్తున్నారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాల మధ్య కూడా ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు.
వైఎస్సార్‌సీపీ అండతో నిప్పు కణికలై కదం తొక్కుతున్నారు. ఫలితంగా 70వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ‘సమైక్య’ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేశారు. బ్యాంకులు, ఏటీఎంలను మూసి వేయించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జెడ్పీ ఎదుట సోనియా, కేసీఆర్, దిగ్విజయ్, బొత్స దిష్టిబొమ్మలకు సమాధి కట్టి నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి.. బ్యాంకులు, ఏటీఎంలను బంద్ చేయించారు.
విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్‌ఓ హేమసాగర్ మద్దతు తెలిపారు. అనంతరం వారు పాతూరు పవరాఫీసు భవనంపెకైక్కి సమైక్య నినాదాలు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు సమ్మెబాట పట్టడంతో రెండవ రోజు కూడా సర్వజనాస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. ఎస్కేయూలో ఎంపీఈడీ కౌన్సెలింగ్‌కు హాజరైన తెలంగాణ విద్యార్థి రవిని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యాన వర్సిటీ ఎదుట 205 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో గొబ్బెమ్మలు పెట్టి నిరసన తెలిపారు.
ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రిలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను బంద్ చేశారు. ముదిగుబ్బలో రాస్తారోకో చేశారు. గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుందంటూ ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు ‘మాక్ ప్రదర్శన’ నిర్వహించారు.
పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కట్టారు. టీ-నోట్‌పై జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు వైకుంఠ సమారాధన, పిండ ప్రదానం చేశారు. సద్భావన సర్కిల్‌లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మానవహారం నిర్మించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. సప్తగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. ఎన్‌జీఓలు బైక్ ర్యాలీ చేపట్టి..కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసి వేయించారు.
చిలమత్తూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో పట్టణ ఖాద్రీ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సామూహిక దీక్ష చేశారు. ఈ దీక్షకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గాండ్లపెంటలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డిని అడ్డుకున్నారు. రోడ్డుపై ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. నల్లచెరువులో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంతో పాటు మడకశిరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు బంద్ చేయించారు. మడకశిరలో జేఏసీ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్‌ఫార్మర్ పెకైక్కి నిరసన తెలిపారు.
రైతులు పొలం పనులు వదిలి ‘సమైక్య’ ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో రొళ్లలో అర్ధనగ్న ప్రదర్శన, అమరాపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల, గార్లదిన్నె, నార్పలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, సోమందేపల్లిలో భిక్షాటన, కణేకల్లులో ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తిలో వైద్య సిబ్బంది, పరిగి, గోరంట్లలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాప్తాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, చెన్నెకొత్తపల్లిలో రాస్తారోకో చేపట్టారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే ఆకులు తిని బతకాల్సిందేనంటూ ఆకులు తింటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులకు మున్సిపల్ ఉద్యోగులు పిండప్రదానం చేశారు. నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేపట్టారు.
ఎందాకైనా..
Published Wed, Oct 9 2013 2:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
Advertisement
Advertisement