ఆగ్రహ జ్వాల | protest activities throughout the district on Sunday | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాల

Published Mon, Oct 7 2013 2:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

protest activities throughout the district on Sunday

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. పార్టీ పిలుపు మేరకు 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు. వైఎస్సార్‌సీపీ బంద్, ఆందోళనల నేపథ్యంలో మూడో రోజు కూడా ‘అనంత’ జనజీవనం స్తంభించిపోయింది. రైల్‌రోకోలు, రహదారుల దిగ్బంధం, ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు, వంటా వార్పు తదితర నిరసనలు జిల్లా నలుమూలలా హోరెత్తాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలు, కుల, ప్రజా సంఘాల జేఏసీల నేతలు, సమైక్యవాదులు, ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, లింగాల శివశంకర్‌రెడ్డి, మీసాల రంగన్న, రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక తపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుకడ్డంగా పాతటైర్లకు నిప్పంటించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. నగరంలో మెడికల్, యువ జేఏసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు.
 
 సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆదివారం పశువుల సంతను ‘అనంత’ మార్కెట్‌యార్డు ఎదురుగా రోడ్డుపై నిర్వహించాల్సి వచ్చింది. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రేగాటిపల్లి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించి... 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు.
 
 దర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో సమైక్యవాదులు వంటా వార్పు చేపట్టారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును గంటపాటు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు 15 మందిని పోలీసులు అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఎస్సీ, ఎస్టీలు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు.
 
 గుత్తిలో వైఎస్సార్‌సీపీ నేతలు సోనియా, బొత్స, దిగ్విజయ్, కేసీఆర్, పనబాకలక్ష్మి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ హర్షకుమార్ తనయుల దౌర్జన్యానికి నిరసనగా గుత్తిలో ఉద్యోగ జేఏసీ నేతలు మౌనదీక్ష చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పామిడిలో వైఎస్సార్‌సీపీ నాయకులు వంటా వార్పు చేపట్టారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేత నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు రాస్తారోకో చేశారు.
 
 విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్సదిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి... రోడ్డుపై సమాధి కట్టి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బంద్ చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా వజ్ర భాస్కర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. జేఏసీ నాయకులు నోటికి అడ్డంగా నల్లని రిబ్బన్ కట్టుకొని పట్టణంలో ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్‌టీసీ కార్మికులు రిలే దీక్షలు చేశారు. తలుపుల, తనకల్లు, ఎన్‌పీ కుంట, నల్లచెరువు మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు బంద్ చేపట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, నాయకులు కిరిటీ యాదవ్, రామాచారి, దేవపుత్ర చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పట్టణ బంద్ చేపట్టారు.
 
 ఉద్యోగ జేఏసీ నేతలు తెలుగుతల్లి విగ్రహం వద్ద మానవహారం నిర్మించారు. విభజనతో మనస్తాపం చెంది కంబదూరు మండలంలో వైఎస్సార్‌సీపీ బంద్‌లో పాల్గొన్న చెన్నంపల్లి వాసి మల్లికార్జున నాయక్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో బంద్ విజయవంతమైంది. మడకశిర లో వైఎస్సార్‌సీపీ నేతల దీక్షలు రెండో రోజుకు చేరాయి.
 
 మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేత వైసీ గోవర్దన్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ్ మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది. మడకశిరలో జేఏసీ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా సోమవారం పుట్టపర్తిలో 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు. కొత్తచెరువులో దీక్ష చేస్తున్న సమైక్యవాదులకు కర్ణాటక రాష్ట్ర వైఎస్సార్ వేదిక నాయకులు మద్దతు ప్రకటించారు. బుక్కపట్నం, కొత్తచెరువులో బంద్ విజయవంతమైంది.
 
 అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పెనుకొండ వైఎస్సార్‌సీపీ నేతలు స్థానికంగా ఉన్న కుంభకర్ణుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ప్రార్థించారు. సమైక్యవాదులు మంత్రి రఘువీరా దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి.. తరువాత ఉరితీసి నిరసన తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు ధర్నా చేశారు. సోమందేపల్లిలో విద్యార్థులు సైకిల్‌ర్యాలీ, రొద్దంలో ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు.
 
 గోరంట్ల, పరిగిలో వైఎస్సార్‌సీపీ నేతలు బంద్ చేపట్టారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ విజయవంతం చేశారు. విద్యార్థుల ర్యాలీలో ఎమ్మెల్యేపాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రహదారిని దిగ్బంధించారు.  రాప్తాడులోని 44వ జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో పార్టీ కార్యకర్తలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అదే మండలం తగరకుంటలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. చెన్నేకొత్తపల్లిలో బంద్‌ను తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యవేక్షించారు.  వైఎస్సార్‌సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమలలోని తాడిపత్రి-అనంతపురం రహదారిపై రాస్తారోకో చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో బంద్ విజయవంతమైంది. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బంద్ చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి జేసీ సోదరులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.
 
 పోలీసు బలగాలను భారీగా మోహరించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.  ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకు ర్యాలీ చేపట్టి.. బంద్ విజయవంతం చేశారు. ఉరవకొండ, విడపనకల్లులో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉరవకొండలో జేఏసీ రిలే దీక్షలకు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. వజ్రకరూరులో వైఎస్సార్‌సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement