సాక్షి, నెల్లూరు : ఎన్‌జీఓలు సమ్మె విరమించినా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ మాత్రం ఆగలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు 80వ రోజూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదంటూ నినదించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నేతలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆందోళనలు కొనసాగించారు.
వీఆర్‌సీ సెంటర్‌లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం గాంధీ హానికి వినతి పత్రం సమర్పించారు. కోవూరులో చౌకదుకాణం డీలర్లు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యరాష్ట్రం కోరుతూ చౌకదుకాణాల డీలర్ల ధర్నా నిర్వహించారు. కావలి పట్టణంలో వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి. ఉదయగిరి పట్టణంలోని బస్టాండు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం కాశీపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆగని పోరు
Published Sat, Oct 19 2013 5:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement