సమైక్యాంధ్ర కోసం సింహపురి వాసులు 77 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను కష్టాల పాలుచేయవద్దని, అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం సింహపురి వాసులు 77 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను కష్టాల పాలుచేయవద్దని, అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు ఎన్జీఓ భవన్‌లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్ష చేశారు.
ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంలో పూసలకాలనీవాసులు కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. వింజమూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్‌లో సమైక్యవాదులు రిలేదీక్ష చేసి, రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన రైతుగర్జన విజయవంతమైంది. రిలేనిరాహార దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ నాయకులు, ప్రజలు బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
కావలిలో ైవె ఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్న వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో పలుచోట్ల రిలేదీక్షలు జరిగాయి. పొదలకూరులో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పొదలకూరు పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు.