కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమ ముఖద్వారం ప్రముఖ పాత్రపోషిస్తోంది. మొట్టమొదటి సారిగాఈ గడ్డ మీద నుంచే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా లక్షగళాలు ఘోషించాయి. ముస్లింలు మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించి దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఇదే స్ఫూర్తితో సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
బహిరంగ సభ జరిగే ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఖరారుచేశారు. అలాగే సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. రెండు ప్రధాన గేట్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు నవాబు రసూల్ ఖాన్ ద్వారాలు నామకరణం చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చే వారందరికీ మంచినీళ్లు, మజ్జిగ, అన్నం ప్యాకెట్లు సరఫరా చేయడానికి 500 మంది వలంటీర్లను నియమించారు. వారికి ప్రత్యేక డ్రస్‌కోడ్ రూపొందించారు. బహిరంగ సభ వేదిక పక్కన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం పది గంటల నుంచి ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి బహిరంగ సభ మొదలవుతుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు ప్రధాన వక్తగా పాల్గొంటారు. ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు ఆర్టీసీ, విద్యుత్ ఇరిగేషన్ తదితర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు.. విభజనతో కలిగే పరిణామాలు, ఉద్యోగులకు ఏర్పడే నష్టం, కలసి ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు భవిష్యత్తు వ్యూహాన్ని వివరించనున్నారు.
వేదికపైన ఎవరెవరు ఆసీనులవుతారు, ఎంతమంది ప్రసంగిస్తారనేదానిని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు నిర్ణయిస్తారని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నేతలు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు శనివారం ఏర్పాట్లను సమీక్షించారు. బహిరంగసభ విజయవంతానికి జిల్లా అధికారుల సంఘం నేతలు సూర్యప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, హరినాథరెడ్డి, ఆనంద్‌నాయక్ తదితరులు పూర్తిగా సహకరిస్తున్నారు.
భారీగా తరలివస్తున్న
ఉద్యోగులు, ప్రజలు
సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభకు వేలాదిమంది పాదయాత్ర ద్వారా కర్నూలుకు తరలివస్తున్నారు. డోన్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల మంది పాదయాత్ర ద్వారా శనివారం ఉదయమే కర్నూలుకు బయలుదేరారు.
రాత్రికే వారు కర్నూలుకు చేరుకున్నారు. మరిన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది పాదయాత్ర ద్వారా తరలివస్తున్నారు. నగరం మొత్తం సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన ఫ్లెక్సీ బ్యానర్ల పోస్టర్లతో నిండిపోయింది. ప్రజాగర్జన బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి సమైక్యవాదాన్ని బలంగా ఢిల్లీ పీఠానికి చాటిచెప్పాలనే కసి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.
నేడే ప్రజాగర్జన
Published Sun, Sep 29 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement