Narismha reddy
-
ఉత్కంఠ భరితం.. పిడకల సమరం
ఆస్పరి, న్యూస్‌లైన్: దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం గ్రామానికి పెద్ద సంబరం. గ్రామస్తులంతా రెండుగా విడిపోయి పిడకలతో తలపడటం, ఆతరువాత అంతా కలసిపోయి ఆనందాన్ని పంచుకోవడం మండలంలోని కైరుప్పల గ్రామ ప్రత్యేకత. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పిడకల సమరం వేలాది మంది జనం మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. అరగంటపాటు సాగిన నుగ్గులాట చివరకు ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలే కాకుండా కర్ణాటక, మహరాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాతో రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో దాడి చేసుకోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. సమరంలో ముందుగా ఆనవాయితీగా కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్తుడు విష్ణువర్దన్‌రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి గుర్రంపై కైరుప్పల గ్రామంలోకి మంది మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో చేరుకున్నాడు. ఆయన దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల సమరం మొదలైంది. గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటు ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటు గుంపులు, గుంపులుగా కదిలారు. తమ వర్గం గెలవాలనే తపనతో మహిళలు పురుషులకు పిడకలు అందిస్తు సాయంగా నిలిచారు. అక్కడ కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు ఈపోరు కొనసాగింది. దాదాపు 70 మందికి పైగా గాయపడ్డారు. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు పూసుకున్నారు. జనంతో కైరుప్పల కిట కిటలాడింది. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పిడకల సమరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, కిరణ్ ఆధ్వర్యంలో 80 మంది పోలీస్ బందో బస్తు నిర్వహించారు. పిడకల సమరం ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. -
ఉద్యమకారులకు టీఆర్ఎస్లో చోటు లేదు
అది ఓ ఫ్యామిలీ పార్టీ 1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఓ ఫ్యామిలీ పార్టీ అని, ఆ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదని 1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజమెత్తింది. నాయిని నర్సింహారెడ్డి మినహా ఎవ్వరూ నాటి ఉద్యమకారులు లేరని, నరేంద్ర లాంటి వారిని బయటకు పంపించేశారని ఆరోపించింది. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక చైతన్యం కనిపించదని సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కొల్లూరి చిరంజీవి దుయ్యబట్టారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో అవినీతి ఉందని, నాటి 1969 ఉద్యమం అందుకు భిన్నంగా నడిచిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చిరంజీవి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైందని, ఉద్యమం ప్రారంభంలో జన హక్కుల పరిరక్షణ సమితి ఉండేదని గుర్తుచేశారు. తదనంతరం మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని చేపట్టారని వివరించారు. 2009లో కేసీఆర్ నిమ్మరసం సేవించి దీక్ష విరమించిన తర్వాత కూడా విద్యార్థులే ఉద్యమాన్ని నడిపించారన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాజకీయ పార్టీ ఆవిర్భావం దిశగా: 1969 ఉద్యమకారుల సమాఖ్య ఇకపై రాజకీయ వేదికగా రూపుదిద్దుకునేందుకు ఆలోచన చేస్తోంది. తెలంగాణలోని పది జిల్లాల్లోని ఉద్యమకారులందరిని ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల చివర్లో రెండు రోజుల సదస్సును నిర్వహించి దీనిపై తుదినిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని వెళ్లే దిశగా యోచిస్తున్నట్లు కొల్లూరి చిరంజీవి తెలిపారు. ఎన్నికల లోపు కొత్త పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1969 ఉద్యమకారులు కేఎం ఆరీఫుద్దీన్, ఎల్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, మేచినేని కిషన్‌రావు, పి.విఠల్‌రావు, అన్వర్ పటేల్, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ వీరుడు.. రేనాటి సూర్యుడు
ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్ : ‘సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ’ అనే జానపద గేయం రాయలసీమ ప్రజల నాలుకపై నానుతూ ఆయన తెగువ, త్యాగానికి నిదర్శనంగా మారుమోగుతోంది. భారత దేశంలో తెల్లదొరల నిరంకుశత్వ పాలనపై మొదటి సారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు రేనాటి గడ్డ సూర్యుడు, విప్లవ వీరుడు మన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి. నేడు ఆయన 167 వర్ధంతి సందర్భంగా ‘న్యూస్‌లైన్’ కథనం. ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారె డ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్వారికి దారాదత్తం చేశారు. పాలనలో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్ నిరంకుశ పాలనపై ఆగ్రహించిన ఈయన మొదటిసారిగా 1842లో వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాకుండా ఖజానా కొల్లగొట్టడంతో బ్రిటీష్‌వారు వణికిపోయారు. అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేసిన బ్రిటీష్ వారు ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటుగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం ఆయన వీరత్వానికి ప్రతీక. ఆయన త్యాగానికి గుర్తింపేది నంద్యాల, న్యూస్‌లైన్: తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బ్రిటీష్ వారి చేతిలో వీరమరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సర్కారు గుర్తించకపోవడంపై నల్లమల, కుందూ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నేతల ఒత్తిడి మేరకు ప్రాధాన్యం లేని వ్యక్తుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ప్రాంతం కోసం బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు చేసి ప్రాణాలొడ్డిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆమాత్రం గుర్తింపు ఇవ్వకపోవడం గమనార్హం. ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ మాజీ సభ్యుడు ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన పోచాబ్రహ్మానందరెడ్డి మాత్రం ఏటా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన త్యాగాలను స్మరించుకుంటుండడం విశేషం. నరసింహారెడ్డితో పాటు దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డికి సంబంధించి పలు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపిన అధికార పార్టీకి చెందిన నాయకులు పట్టించుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వానికి పంపిన తీర్మానాలు... ఈ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రిజర్వాయర్లు, చెరువులు, విద్యాసంస్థలు, రైళ్లు, బస్టాండ్లు ఇతర వాటికి వారిద్దరి పేర్లు పెట్టాలి వీరి పేరుతో తపాలా బిల్లలు విడుదల చేయాలి. నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చాలి వీరిద్దరి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించారు. పార్లమెంటులో సైతం నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి. నంద్యాల, కర్నూలు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో వీరిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేయాలి. సినిమాలు, డాక్యుమెంటరీ చిత్రాలు తీసి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే ఏర్పాటు చే యాలి. వీరికి సంబంధించిన రచనలను ప్రభుత్వ ఖర్చుతో ప్రచురించి గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో అందుబాటులో ఉంచాలి. వీరిద్దరిపై పీహెచ్డీ చేసిన వారి గ్రంథాలను కూడా ముద్రింపజేయాలి. గుర్తింపు లభించే వరకు పోరాటం: పోచాబ్రహ్మానందరెడ్డి, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షుడు మొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా నరసింహారెడ్డిని గుర్తించాలని ఇప్పటికే రేనాటి ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈయనతోపాటు దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బుడ్డా వెంగళరెడ్డికి కూడా ఎప్పుడో గుర్తింపు లభించి ఉండాల్సింది. రవీంద్రభారతితోపాటు విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీరి సాహసాలు, త్యాగాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తాం. అవకాశం లభిస్తే రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేస్తాం. -
నేడే ప్రజాగర్జన
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమ ముఖద్వారం ప్రముఖ పాత్రపోషిస్తోంది. మొట్టమొదటి సారిగాఈ గడ్డ మీద నుంచే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా లక్షగళాలు ఘోషించాయి. ముస్లింలు మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించి దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఇదే స్ఫూర్తితో సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బహిరంగ సభ జరిగే ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఖరారుచేశారు. అలాగే సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. రెండు ప్రధాన గేట్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు నవాబు రసూల్ ఖాన్ ద్వారాలు నామకరణం చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చే వారందరికీ మంచినీళ్లు, మజ్జిగ, అన్నం ప్యాకెట్లు సరఫరా చేయడానికి 500 మంది వలంటీర్లను నియమించారు. వారికి ప్రత్యేక డ్రస్కోడ్ రూపొందించారు. బహిరంగ సభ వేదిక పక్కన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం పది గంటల నుంచి ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి బహిరంగ సభ మొదలవుతుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు ప్రధాన వక్తగా పాల్గొంటారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు ఆర్టీసీ, విద్యుత్ ఇరిగేషన్ తదితర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు.. విభజనతో కలిగే పరిణామాలు, ఉద్యోగులకు ఏర్పడే నష్టం, కలసి ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు భవిష్యత్తు వ్యూహాన్ని వివరించనున్నారు. వేదికపైన ఎవరెవరు ఆసీనులవుతారు, ఎంతమంది ప్రసంగిస్తారనేదానిని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు నిర్ణయిస్తారని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నేతలు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు శనివారం ఏర్పాట్లను సమీక్షించారు. బహిరంగసభ విజయవంతానికి జిల్లా అధికారుల సంఘం నేతలు సూర్యప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, హరినాథరెడ్డి, ఆనంద్‌నాయక్ తదితరులు పూర్తిగా సహకరిస్తున్నారు. భారీగా తరలివస్తున్న ఉద్యోగులు, ప్రజలు సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభకు వేలాదిమంది పాదయాత్ర ద్వారా కర్నూలుకు తరలివస్తున్నారు. డోన్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల మంది పాదయాత్ర ద్వారా శనివారం ఉదయమే కర్నూలుకు బయలుదేరారు. రాత్రికే వారు కర్నూలుకు చేరుకున్నారు. మరిన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది పాదయాత్ర ద్వారా తరలివస్తున్నారు. నగరం మొత్తం సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన ఫ్లెక్సీ బ్యానర్ల పోస్టర్లతో నిండిపోయింది. ప్రజాగర్జన బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి సమైక్యవాదాన్ని బలంగా ఢిల్లీ పీఠానికి చాటిచెప్పాలనే కసి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.