విప్లవ వీరుడు.. రేనాటి సూర్యుడు | kurnool distirct news | Sakshi
Sakshi News home page

విప్లవ వీరుడు.. రేనాటి సూర్యుడు

Published Sat, Feb 22 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

kurnool distirct news

ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్ :  ‘సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ’ అనే జానపద గేయం రాయలసీమ ప్రజల నాలుకపై నానుతూ ఆయన తెగువ, త్యాగానికి నిదర్శనంగా మారుమోగుతోంది. భారత దేశంలో తెల్లదొరల నిరంకుశత్వ పాలనపై మొదటి సారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు రేనాటి గడ్డ సూర్యుడు, విప్లవ వీరుడు మన ఉయ్యాలవాడ నారసింహారెడ్డి. నేడు ఆయన 167 వర్ధంతి సందర్భంగా ‘న్యూస్‌లైన్’ కథనం. ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారె డ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్‌వారికి దారాదత్తం చేశారు. పాలనలో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన  కొనసాగేది. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్  నిరంకుశ పాలనపై ఆగ్రహించిన ఈయన మొదటిసారిగా 1842లో వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాకుండా ఖజానా కొల్లగొట్టడంతో బ్రిటీష్‌వారు వణికిపోయారు.
 
 అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేసిన బ్రిటీష్ వారు ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటుగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం ఆయన వీరత్వానికి ప్రతీక.
 
  ఆయన త్యాగానికి గుర్తింపేది
 నంద్యాల, న్యూస్‌లైన్: తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బ్రిటీష్ వారి చేతిలో వీరమరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సర్కారు గుర్తించకపోవడంపై నల్లమల, కుందూ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నేతల ఒత్తిడి మేరకు ప్రాధాన్యం లేని వ్యక్తుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ప్రాంతం కోసం బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు చేసి ప్రాణాలొడ్డిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆమాత్రం గుర్తింపు ఇవ్వకపోవడం గమనార్హం.
 
 ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సిటీ మాజీ సభ్యుడు ఉయ్యాలవాడ మండల కేంద్రానికి చెందిన పోచాబ్రహ్మానందరెడ్డి మాత్రం ఏటా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన త్యాగాలను స్మరించుకుంటుండడం విశేషం. నరసింహారెడ్డితో పాటు దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డికి సంబంధించి పలు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపిన అధికార పార్టీకి చెందిన నాయకులు పట్టించుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
 
 గతంలో ప్రభుత్వానికి పంపిన తీర్మానాలు...
  ఈ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రిజర్వాయర్లు, చెరువులు, విద్యాసంస్థలు, రైళ్లు, బస్టాండ్‌లు ఇతర వాటికి వారిద్దరి పేర్లు పెట్టాలి
  వీరి పేరుతో తపాలా బిల్లలు విడుదల చేయాలి.
  నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చాలి  
  వీరిద్దరి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించారు.
  పార్లమెంటులో సైతం నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి. నంద్యాల, కర్నూలు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో వీరిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేయాలి.
  సినిమాలు, డాక్యుమెంటరీ చిత్రాలు తీసి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే ఏర్పాటు చే యాలి.
 
  వీరికి సంబంధించిన రచనలను ప్రభుత్వ ఖర్చుతో ప్రచురించి గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో  అందుబాటులో ఉంచాలి. వీరిద్దరిపై పీహెచ్‌డీ చేసిన వారి గ్రంథాలను కూడా ముద్రింపజేయాలి.  
 
 గుర్తింపు లభించే వరకు పోరాటం: పోచాబ్రహ్మానందరెడ్డి, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షుడు
  మొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా నరసింహారెడ్డిని గుర్తించాలని ఇప్పటికే రేనాటి ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈయనతోపాటు దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బుడ్డా వెంగళరెడ్డికి కూడా ఎప్పుడో గుర్తింపు లభించి ఉండాల్సింది. రవీంద్రభారతితోపాటు విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీరి సాహసాలు, త్యాగాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తాం. అవకాశం లభిస్తే రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement