సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమను సాకారం చేసే పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో సర్కార్ సొంతంగా వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ పేరిట నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్య కంపెనీగా ఎస్సార్ స్టీల్ ఎంపికైంది. సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,148.68 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఎస్సార్ స్టీల్ చేసిన ప్రతిపాదనకు తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌లో భాగస్వామి ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా సాంకేతిక అంశాలు పరిశీలించాక లిబర్టీ స్టీల్‌ను ఎస్‌బీఐ క్యాప్ ఎంపిక చేసింది. అయితే లిబర్టీ స్టీల్‌కు ఆర్థిక వనరులను సమకూర్చే మాతృ సంస్థ జీఎఫ్‌జీ అలయన్స్ బ్రిటన్‌లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందనే వార్తలు రావడంతో రెండో స్థానంలో ఉన్న ఎస్సార్ స్టీల్‌ను ఎంచుకుంది. ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
ప్రభుత్వానికి 85 శాతం వాటా
ఏడాదికి మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో వివిధ ఉక్కు ఉత్పత్తుల తయారీకి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఇందుకు మొత్తం రూ.11,606 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ భాగస్వామ్య కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం 85 శాతం, ఎస్సార్ స్టీల్ 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి. ఈ భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ.4,062 కోట్ల ప్రారంభ మూలధనం అవసరమవుతుందని అంచనా వేయగా.. ఇందులో ఎస్సార్ స్టీల్ రూ.609 కోట్ల సమకూరుస్తుంది. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్లపైన పెట్టుబడి పెట్టనుంది.
2024 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభం..
తొలి దశలో ఏడాదికి కనీసం పది లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్చి 31, 2024కి ఉత్పత్తిని ప్రారంభించాలి. తొలిదశలో 3,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్సార్ స్టీల్ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే అనేక యూనిట్లు, ఇతర కార్యకలాపాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి ఒప్పందం కుదిరి ఎస్సార్ స్టీల్ పనులు ప్రారంభించేలోగా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనుంది. ఉత్పత్తిని ప్రారంభించే నాటికి భాగస్వామ్య కంపెనీలో మెజార్టీ వాటా అంటే 51 శాతం వాటాను ఎస్సార్ స్టీల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్పత్తి ప్రారంభమైన ఏడేళ్లలోపు రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి వాటాను విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉత్పత్తి మొదలయ్యాక ఏడేళ్లపాటు రాష్ట్ర పెట్టుబడులకు 8.7 శాతం చొప్పున రాబడి రావచ్చని ఎస్‌బీఐ క్యాప్ అంతర్గత అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment