అది ఓ ఫ్యామిలీ పార్టీ
1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఓ ఫ్యామిలీ పార్టీ అని, ఆ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదని 1969 ఉద్యమకారుల సమాఖ్య ధ్వజమెత్తింది. నాయిని నర్సింహారెడ్డి మినహా ఎవ్వరూ నాటి ఉద్యమకారులు లేరని, నరేంద్ర లాంటి వారిని బయటకు పంపించేశారని ఆరోపించింది. టీఆర్‌ఎస్ పార్టీలో సామాజిక చైతన్యం కనిపించదని సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కొల్లూరి చిరంజీవి దుయ్యబట్టారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో అవినీతి ఉందని, నాటి 1969 ఉద్యమం అందుకు భిన్నంగా నడిచిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చిరంజీవి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైందని, ఉద్యమం ప్రారంభంలో జన హక్కుల పరిరక్షణ సమితి ఉండేదని గుర్తుచేశారు. తదనంతరం మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని చేపట్టారని వివరించారు. 2009లో కేసీఆర్ నిమ్మరసం సేవించి దీక్ష విరమించిన తర్వాత కూడా విద్యార్థులే ఉద్యమాన్ని నడిపించారన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని చెప్పారు.
రాజకీయ పార్టీ ఆవిర్భావం దిశగా: 1969 ఉద్యమకారుల సమాఖ్య ఇకపై రాజకీయ వేదికగా రూపుదిద్దుకునేందుకు ఆలోచన చేస్తోంది. తెలంగాణలోని పది జిల్లాల్లోని ఉద్యమకారులందరిని ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల చివర్లో రెండు రోజుల సదస్సును నిర్వహించి దీనిపై తుదినిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని వెళ్లే దిశగా యోచిస్తున్నట్లు కొల్లూరి చిరంజీవి తెలిపారు. ఎన్నికల లోపు కొత్త పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1969 ఉద్యమకారులు కేఎం ఆరీఫుద్దీన్, ఎల్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, మేచినేని కిషన్‌రావు, పి.విఠల్‌రావు, అన్వర్ పటేల్, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో చోటు లేదు
Published Mon, Mar 3 2014 3:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement