భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోంది
ప్రధాని మోదీ ఆగ్రహం
తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ప్రచారం
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు.
అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు.
కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు?
తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు.
వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.
అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి..
నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment