నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
నెల్లూరు (బారకాసు): విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు జేజేలు పలికారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు జై జగన్.. జైజై జగన్.. జయహో జగన్ మామ.. అంటూ చేసిన నినాదాలతో నెల్లూరు నగరం ప్రతిధ్వనించింది. విద్యార్థి సాధికారత కోసం సీఎం చేస్తున్న కార్యక్రమాల వివరాలున్న ఫ్లెక్సీలు రెపరెపలాడాయి. బడుగు, బలహీన విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు, విద్యార్థులు చదువుకునేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వివరిస్తూ విద్యార్థులు, నేతలు కదం తొక్కారు.
నగరంలో భారీగా విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఆసాంతం అందరినీ ఆకర్షించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన తదితర పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని వేలనోళ్లు ప్రశంసించడం వినిపించింది. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులో నిర్వహించిన ‘విద్యార్థి సాధికారత జగనన్నతోనే సాధ్యం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వీఆర్సీ క్రీడామైదానం నుంచి ట్రంకురోడ్డు గాందీబోమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువతీ యువకులు ఫ్లెక్సీలు పట్టుకుని విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ ఆకాంక్షించారు. ముఖ్య అతిథి వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువుకు భరోసా ఇస్తున్న వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి పథకం, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కార్పొరేట్, ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తారని, వారు అధికారంలోకి వస్తే పేద విద్యార్థులు చదువు మానుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో యావత్ విద్యార్థి లోకమంతా జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని బహిరంగంగా ప్రతినబూనుతున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment