
ఏడు నెలలుగా ఇదే తంతు
నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో దుస్థితి
ఉదయగిరి: చదువుకోవాల్సిన విద్యార్థులతో వంట పనులు చేయిస్తూ వేధిస్తున్నారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ వేధింపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 428 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్‌లు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారు.
కానీ ప్రతి రోజూ వంటతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులను 15 మంది చొప్పున బ్యాచ్‌లుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంట పనులు చేయిస్తున్నారు. ఆదివారం చపాతీలు చేయాల్సి ఉంది. విద్యార్థులందరికీ కలిపి దాదాపు 1,300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే ఒక బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
ఏడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ పుష్పరాజ్‌ను వివరణ కోరగా.. ఆదివారం నలుగురు వంట సిబ్బందిలో ఇద్దరు విధులకు హాజరవ్వలేదని చెప్పారు. దీంతో వంట పనులు విద్యార్థులతో చేయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాగా, కన్జ్యూమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు తిరుపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment