రాజంపేట రూరల్/రైల్వేకోడూరు అర్బన్/ప్రొద్దుటూరు టౌన్ న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో గుండెలు పగులుతున్నాయి. రాజంపేటలో ఒకరు, రైల్వేకోడూరులో మరో యువకుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలిదానం అయ్యారు. రాజంపేట ప్రభుత్వ క్రీడామైదానంలో శనివారం జరిగిన రణభేరి సభలో చిట్వేలి మండలం మైలుపల్లెకు చెందిన లైన్‌మెన్ ఆర్.వెంకట్రావు(47) ఆకస్మికంగా మృతిచెందారు. జై సమైక్యాంధ్ర అంటూ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఆయనను వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులతో పరీక్షలు చేయించారు.
వైద్యులు కూడా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు. నెల్లూరుజిల్లా గూడూరుకు చెందిన వెంకట్రావుకు బద్వేలుకు చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ గుండెపోటుతో మృతిచెందిన వెంకట్రావు కుటుంబానికి రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మేడా మల్లికార్జునరెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సభలోనే ప్రకటించారు.
భావోద్వేగానికి గురై..
సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగానికి గురై రైల్వేకోడూరుకు చెందిన ఉంగరాల రాకేష్(35) మృతిచెందారు. న్యూకృష్ణానగర్‌కు చెందిన రాకేష్ సమైక్యాంధ్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఢిల్లీలో శుక్రవారం కోర్ కమిటీ తెలంగాణా విషయమై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భావోద్వేగానికి గురై శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు భార్య మయూరి తెలిపారు. మృతుడికి కూతురు సాయి, కొడుకు బబ్లూ ఉన్నారు.
గుండెపోటుకు గురై..
సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుకు గురై ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసులు (45) మృతి చెందాడు. శనివారం సమైక్యాంధ్రా కోసం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన శ్రీనివాసులు గుండెపోటుకు గురై కుప్పకూలారు.
ఆగిన గుండెలు
Published Sun, Sep 15 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement