సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న శారదా విద్యాలయలో ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొంటూ.. విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (జనవరి 31) జరిగిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా.. తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గౌరవ అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.
గ్రౌండ్‌లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఐదు నెట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు, అథ్లెటిక్స్ కొరకు ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ మైనేని పాల్గొన్నారు. వీరితో పాటు శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ శ్రీ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు.
కాగా, నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో వై సత్యనారాయణ గారు 1922లో శారదా విద్యాలయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను నాటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శారదా విద్యాలయకు 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment