jai samaikayanadhara
-
ఖాకీ క్రౌర్యం!
ఈ ఫొటోలో ఎస్ఐ ఓ యువకుని పీక బలంగా నొక్కుతున్నాడు. ఆ యువకుడేమీ దేశ ద్రోహ నేరానికి పాల్పడలేదు. పేరు మోసిన ఉగ్రవాది అసలే కాదు. తెలుగుజాతిని నిట్ట నిలువునా చీలుస్తున్న పాలకుల తీరుపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సహచర విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్దకు వచ్చాడు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే.. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ రంగనాయకులుకు కోపం కట్టలు తెంచుకుంది. యువకుడి గొంతు అదిమి పట్టుకున్నాడు. ఆ యువకుడు కేకలు వేస్తున్నా సదరు ఎస్ఐ ఏమాత్రం వినిపించుకోలేదు. బలవంతంగా గొంతు అదిమి పట్టి అరెస్టు చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఇదేం దారుణం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. -ఫొటోలు: రమేష్, న్యూస్‌లైన్, కడప -
గుండె మండింది
సాక్షి, నెల్లూరు: సింహపురిలో సమైక్య ఉద్యమ జ్వాలలు శనివారం ఎగిశాయి. రాష్ట్రవిభజనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. వైఎస్సార్సీపీ 72 గంటల బంద్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలో అన్ని వీధుల్లో టైర్లు, మొద్దులు వేసి తగల బెట్టి ఆందోళనలు నిర్వహించారు. ఎగిసిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగతో నగరం తగలబడుతున్నట్లుగా కనిపించింది. పిన్నలు, పెద్దలు, మహిళలు సైతం ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చి జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరంలో మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది టైర్లు తగలబెట్టి బంద్‌ను పర్యవేక్షించారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గం సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రూరల్‌లో బంద్‌ను పర్యవేక్షించారు. జేఏసీ నేతలు మంత్రి ఆనం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా బొమ్మలతో శవయాత్రను నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మసెంటర్‌లో దహనం చేశారు. సోనియా బొమ్మలతో సమైక్య ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముంగమూరును ఉపాధ్యాయ జేఏసీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజీనామాలు చేయకుండా డ్రామాలేంటంటూ వాదనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రెండోరోజూ బంద్ విజయవంతమైంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 400 బైక్‌లతో బుచ్చిరెడ్డిపాళెంలో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 600 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ, జేఏసీల ఆధ్వర్యంలో దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో బంద్ నిర్వహించార ు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ, జేఏసీ నాయకులు గుర్రాలపై ఎక్కి నిరసన తెలిపారు. రిక్షాలు తొక్కడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టి-నోట్ ఆకారంలో టైర్లు పేర్చి దహనం చేశారు. మెయిన్‌రోడ్డు సెంటర్లో చిన్నారులు మంటలువేసి నిరసన వ్యక్తం చేశారు. జలదంకిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ కన్వీనర్ బత్తినపట్ల వీరారెడ్డి, పట్టణ జేఏసీ కన్వీనర్ రమాకాంత్ వివిధ సంఘాల జేఏసీ నాయకులు రెండో శనివారం బంద్ నిర్వహించారు. పట్టణంలో దుకాణాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకులు కూడా మూతపడ్డాయి. కావలిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి జెండా చెట్టు సెంటర్ వరకు, అక్కడి నుంచి గౌరవరం జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి గౌరవరం జాతీయ రహదారి వద్ద రాస్తారోకో చేశారు. అందరూ ఐక్యంగా పోరాడి సమైక్యాంధ్ర సాధించుకోవాలని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి గూడూరులో పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్‌లతోపాటు పట్టణ అధ్యక్షుడు నాశిన నాగులు, నాయకులు బత్తిని విజయ్‌కుమార్ తదితరులు టవర్‌క్లాక్‌సెంటర్, సులభ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న శిలాఫలకాల్లోని ఆనం రామనారాయణరెడ్డి, పనబాక లక్ష్మి, చింతా మోహన్ పేర్లను ధ్వంసం చేశారు. అక్కడి నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా బయల్దేరి జాతీయ రహదారి వద్దకు చేరుకుని జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బం ధించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం పాండురంగయాదవ్ ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు నెలవల సుబ్రమణ్యం, దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో మేనకూరు పారిశ్రామిక వాడలోని అన్ని కంపెనీలను మూయించారు. మరో సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మల్లా క్రాస్‌రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. యూత్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ముగ్గురు సమన్వయకర్తలు సంఘీభావంగా కాసేపు దీక్షలో కూర్చున్నారు. ఓజిలి మండల యాదవులు సింహగర్జన నిర్వహించారు. ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ ఏఎస్‌పేట మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీరికి ఆత్మకూరు పట్టణ నేతలు సంఘీభావం తెలిపారు. -
ఆగని పోరు
కడప రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్య ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి ఊరు, వాడ ఏకమవుతోంది. అన్ని వర్గాల వారు చేతులు కలిపి సమైక్య ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. విభజన ఆగేవరకు పోరాటం సాగించాలనే సంకల్పం వారిలో కనిపిస్తోంది. ఆదివారం కూడా రాస్తారోకోలు, దీక్షలు, వంటావార్పులు, జై సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా దద్దరిల్లింది. కడపలో ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు రోడ్లను ఊడ్చి తమ నిరసన వ్యక్తంచేశారు. మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో విక్టరీ అపార్ట్మెంట్ వాసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటావార్పు చేపట్టారు. ప్రొద్దుటూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రిలే దీక్షలను చేపట్టారు. 1956వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని 1956 మంది ఉద్యోగులు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికోన్నత మున్సిపల్ పాఠశాల ఆవరణలో రిలే దీక్షలు చేపట్టారు. కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉషారాణి తదితరులు దీక్షలు చేపట్టిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహిళల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురంలో వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో గ్రామ చావిడి నుంచి క్రాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గంగిరెద్దులతో విన్యాసాలు చేశారు. పార్టీ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయచోటిలో ఫుట్‌వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. విభజన కంటే ఉరే నయమని నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. సమైక్యాంధ్ర జేఏసీ శిబిరంలో రిలే దీక్షలు చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి. బద్వేలులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, రిలే దీక్షలు జరిగాయి. ఈ దీక్షలకు ఆర్టీసీ, రెవెన్యూ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. పోరుమామిళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రెడ్డినగర్‌కు చెందిన పార్టీ మహిళా కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. కలసపాడులో ఇందిరాక్రాంతి పథం మహిళలు విభజనకు వ్యతిరేకంగా మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, గుర్రెడ్డి ఆధ్వర్యంలో సత్రంబడినుంచి పూల అంగళ్ల వరకు ర్యాలీ జరిగింది. అక్కడ జాతీయజెండాతో మానవహారం ఏర్పాటు చేశారు. వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలను చేపట్టారు. మైదుకూరులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నడిరోడ్డుపై బంగారు పని చేసి నిరసన వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. రైల్వేకోడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కూడలి నుంచి పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. విభజన జరిగితే అనర్థాలు, సమైక్యాంధ్రలో ఉండే ఉపయోగాల గురించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ నాగేశ్వరనాయుడు ఆధ్వర్యంలో మిట్టమీదపల్లె, పల్లావారిపల్లె, శవనవారిపల్లె పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ కోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. -
ఆగిన గుండెలు
రాజంపేట రూరల్/రైల్వేకోడూరు అర్బన్/ప్రొద్దుటూరు టౌన్ న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో గుండెలు పగులుతున్నాయి. రాజంపేటలో ఒకరు, రైల్వేకోడూరులో మరో యువకుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలిదానం అయ్యారు. రాజంపేట ప్రభుత్వ క్రీడామైదానంలో శనివారం జరిగిన రణభేరి సభలో చిట్వేలి మండలం మైలుపల్లెకు చెందిన లైన్మెన్ ఆర్.వెంకట్రావు(47) ఆకస్మికంగా మృతిచెందారు. జై సమైక్యాంధ్ర అంటూ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఆయనను వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులతో పరీక్షలు చేయించారు. వైద్యులు కూడా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు. నెల్లూరుజిల్లా గూడూరుకు చెందిన వెంకట్రావుకు బద్వేలుకు చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ గుండెపోటుతో మృతిచెందిన వెంకట్రావు కుటుంబానికి రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మేడా మల్లికార్జునరెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సభలోనే ప్రకటించారు. భావోద్వేగానికి గురై.. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగానికి గురై రైల్వేకోడూరుకు చెందిన ఉంగరాల రాకేష్(35) మృతిచెందారు. న్యూకృష్ణానగర్‌కు చెందిన రాకేష్ సమైక్యాంధ్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఢిల్లీలో శుక్రవారం కోర్ కమిటీ తెలంగాణా విషయమై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భావోద్వేగానికి గురై శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు భార్య మయూరి తెలిపారు. మృతుడికి కూతురు సాయి, కొడుకు బబ్లూ ఉన్నారు. గుండెపోటుకు గురై.. సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుకు గురై ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసులు (45) మృతి చెందాడు. శనివారం సమైక్యాంధ్రా కోసం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన శ్రీనివాసులు గుండెపోటుకు గురై కుప్పకూలారు.