ఆగని పోరు | state agitation become severe | Sakshi
Sakshi News home page

ఆగని పోరు

Published Mon, Sep 16 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

state agitation become severe

కడప రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో  సమైక్య ఉద్యమం రోజురోజుకూ  బలపడుతోంది. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి ఊరు, వాడ ఏకమవుతోంది. అన్ని వర్గాల వారు చేతులు కలిపి సమైక్య ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. విభజన ఆగేవరకు పోరాటం సాగించాలనే సంకల్పం వారిలో కనిపిస్తోంది.
 
 ఆదివారం కూడా  రాస్తారోకోలు, దీక్షలు, వంటావార్పులు, జై సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా దద్దరిల్లింది.  కడపలో ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు రోడ్లను ఊడ్చి తమ నిరసన వ్యక్తంచేశారు.  మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో విక్టరీ అపార్ట్‌మెంట్ వాసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటావార్పు  చేపట్టారు.
 
  ప్రొద్దుటూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రిలే దీక్షలను చేపట్టారు. 1956వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని 1956 మంది ఉద్యోగులు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికోన్నత మున్సిపల్ పాఠశాల ఆవరణలో రిలే దీక్షలు చేపట్టారు.  కమిషనర్ వెంకటకృష్ణ,  తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉషారాణి తదితరులు దీక్షలు చేపట్టిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి సంఘీభావం తెలిపారు.
 
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహిళల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి.  రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  కమలాపురంలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో గ్రామ చావిడి నుంచి క్రాస్‌రోడ్డు వరకు  భారీ ర్యాలీ నిర్వహించారు.  గంగిరెద్దులతో విన్యాసాలు చేశారు.  పార్టీ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
  రాయచోటిలో ఫుట్‌వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. విభజన కంటే ఉరే నయమని  నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకర్షించింది.  సమైక్యాంధ్ర జేఏసీ శిబిరంలో రిలే దీక్షలు చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి.
 
  బద్వేలులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, రిలే దీక్షలు జరిగాయి. ఈ దీక్షలకు ఆర్టీసీ, రెవెన్యూ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. పోరుమామిళ్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రెడ్డినగర్‌కు చెందిన పార్టీ మహిళా కార్యకర్తలు రిలే దీక్షలు  చేపట్టారు. కలసపాడులో  ఇందిరాక్రాంతి పథం మహిళలు విభజనకు వ్యతిరేకంగా మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు.
 
  పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, గుర్రెడ్డి ఆధ్వర్యంలో సత్రంబడినుంచి పూల అంగళ్ల  వరకు ర్యాలీ జరిగింది. అక్కడ జాతీయజెండాతో మానవహారం ఏర్పాటు చేశారు. వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలను చేపట్టారు.
 
  మైదుకూరులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నడిరోడ్డుపై బంగారు పని చేసి నిరసన వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
 
  రైల్వేకోడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కూడలి నుంచి పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. విభజన జరిగితే అనర్థాలు, సమైక్యాంధ్రలో ఉండే ఉపయోగాల గురించి కరపత్రాలు పంపిణీ చేశారు.
 
  రాజంపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ నాగేశ్వరనాయుడు ఆధ్వర్యంలో మిట్టమీదపల్లె, పల్లావారిపల్లె, శవనవారిపల్లె పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు.  ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ కోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement