సాక్షి, నెల్లూరు: సింహపురిలో సమైక్య ఉద్యమ జ్వాలలు శనివారం ఎగిశాయి. రాష్ట్రవిభజనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. వైఎస్సార్‌సీపీ 72 గంటల బంద్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలో అన్ని వీధుల్లో టైర్లు, మొద్దులు వేసి తగల బెట్టి ఆందోళనలు నిర్వహించారు.
ఎగిసిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగతో నగరం తగలబడుతున్నట్లుగా కనిపించింది. పిన్నలు, పెద్దలు, మహిళలు సైతం ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చి జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరంలో మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది టైర్లు తగలబెట్టి బంద్‌ను పర్యవేక్షించారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గం సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రూరల్‌లో బంద్‌ను పర్యవేక్షించారు.
జేఏసీ నేతలు మంత్రి ఆనం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా బొమ్మలతో శవయాత్రను నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మసెంటర్‌లో దహనం చేశారు. సోనియా బొమ్మలతో సమైక్య ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముంగమూరును ఉపాధ్యాయ జేఏసీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజీనామాలు చేయకుండా డ్రామాలేంటంటూ వాదనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రెండోరోజూ బంద్ విజయవంతమైంది.
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 400 బైక్‌లతో బుచ్చిరెడ్డిపాళెంలో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 600 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉదయగిరి నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ, జేఏసీల ఆధ్వర్యంలో దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో బంద్ నిర్వహించార
ు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ, జేఏసీ నాయకులు గుర్రాలపై ఎక్కి నిరసన తెలిపారు. రిక్షాలు తొక్కడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టి-నోట్ ఆకారంలో టైర్లు పేర్చి దహనం చేశారు. మెయిన్‌రోడ్డు సెంటర్‌లో చిన్నారులు మంటలువేసి నిరసన వ్యక్తం చేశారు.
జలదంకిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ బత్తినపట్ల వీరారెడ్డి, పట్టణ జేఏసీ కన్వీనర్ రమాకాంత్ వివిధ సంఘాల జేఏసీ నాయకులు రెండో శనివారం బంద్ నిర్వహించారు. పట్టణంలో దుకాణాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకులు కూడా మూతపడ్డాయి.
కావలిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి జెండా చెట్టు సెంటర్ వరకు, అక్కడి నుంచి గౌరవరం జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి గౌరవరం జాతీయ రహదారి వద్ద రాస్తారోకో చేశారు.
అందరూ ఐక్యంగా పోరాడి సమైక్యాంధ్ర సాధించుకోవాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి గూడూరులో పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్‌లతోపాటు పట్టణ అధ్యక్షుడు నాశిన నాగులు, నాయకులు బత్తిని విజయ్‌కుమార్ తదితరులు టవర్‌క్లాక్‌సెంటర్, సులభ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న శిలాఫలకాల్లోని ఆనం రామనారాయణరెడ్డి, పనబాక లక్ష్మి, చింతా మోహన్ పేర్లను ధ్వంసం చేశారు. అక్కడి నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా బయల్దేరి జాతీయ రహదారి వద్దకు చేరుకుని జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బం ధించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం పాండురంగయాదవ్ ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
నాయుడుపేటలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు నెలవల సుబ్రమణ్యం, దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో మేనకూరు పారిశ్రామిక వాడలోని అన్ని కంపెనీలను మూయించారు. మరో సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మల్లా క్రాస్‌రోడ్డు జంక్షన్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. యూత్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ముగ్గురు సమన్వయకర్తలు సంఘీభావంగా కాసేపు దీక్షలో కూర్చున్నారు. ఓజిలి మండల యాదవులు సింహగర్జన నిర్వహించారు. ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ ఏఎస్‌పేట మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీరికి ఆత్మకూరు పట్టణ నేతలు సంఘీభావం తెలిపారు.
గుండె మండింది
Published Sun, Oct 6 2013 3:51 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement