సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది.
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు
శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు.
ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు.
రాత్రి గూడూరులో బస చేస్తారు.
రెండోరోజు యాత్ర వివరాలు
శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.