రోడ్ల దిగ్బంధం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు, సమైక్యవాదులు రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎన్‌హెచ్-5 జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అంగీకరించేది లేదంటూ పార్టీశ్రేణులు నినదించాయి.
ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన ఆందోళనల్లో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. సర్వేపల్లి సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై మనుబోలు వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వందలసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి. అనీల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం చింతారెడ్డిపాళెం హైవేపై రాస్తారోకో నిర్వహించింది.
ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం నాయకులు ఎన్‌హెచ్-5 కనుపర్తిపాడు సెంటర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుజాతిని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్ వద్ద గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు.
దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల వద్ద కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బం ధించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కోట క్రాస్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై గూడూరు సమన్వయకర్త బాలచెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకోలను నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండు సెంటర్‌లో వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట-శ్రీకాళహస్తి జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి రాస్తారోకో నిర్వహించారు.