కడప అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ఆగస్టు 12 నుంచి ఏన్జీఓ సంఘ నాయకులతోపాటు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. 73 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు శనివారం తెల్లవారుజాము నుంచే బస్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
ప్రభుత్వం యూనియన్‌ల నాయకులతో రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎండి ఏకె ఖాన్‌లు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈనెల 10వ తేదిన 954 జీఓను విడుదల చేశారు. ఆ జీఓలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందన్న విషయంలో స్పష్టత లేదని, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మరలా ఈనెల 11న జరిగిన చర్చల్లో 961 జీఓను విడుదల చేశారు. దీంతో చర్చలు సఫలమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా విధులకు హాజరయ్యారు.