సాక్షి ప్రతినిధి, కడప : ‘ఇంట్లోవాడే కంట్లో పుల్ల పెట్టాడు’ అన్న చందంగా తయారయ్యారు మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఉత్తుత్తి మాటలతో ఉపాధ్యాయుల సమ్మె విరమింపజేసిన ముఖ్యమంత్రి వారి జీతాల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాడు సకల జనుల సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు ఇవ్వాలంటూ జీఓ విడుదల చేసిన కిరణ్ సర్కారు..నేడు సీమాంధ్ర ఉపాధ్యాయులు సమ్మె విరమించి మూడు వారాలు దాటుతున్నా జీఓ ఊసే ఎత్తకుండా కాలం వెల్లబుచ్చుతున్నారు. ఇదేం పక్షపాత పాలన అంటూ ఇక్కడి అయ్యవార్లు శాపనార్థాలు పెడుతున్నారు.
తెలంగాణా టీచర్ల విషయంలో...
సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణా అయ్యవార్లు 2011 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సమ్మెలో పాల్గొన్నారు. ఈ 32రోజుల సమ్మె కాలంలో 16 రోజులు పనిదినాలు కావడంతో ఆ 16 రోజులు అదనంగా పని చేయాలని నాటి కిరణ్ సర్కార్ అక్టోబర్ 21వ తేదీన ఓ మెమో జారీచేసింది. అంతేకాకుండా సమ్మెకాలంలోని రోజులకు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు జీతాలు బిల్లులు చేసుకోవాలని జీఓ నంబర్ 151ని అదేనెల 28వ తేదీన విడుదల చేసింది. అంటే సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు అందజేసిందన్నమాట. అదే కిరణ్ సర్కారు నేడు సీమాంధ్ర అయ్యవార్ల జీతాల విషయంలో దొంగాట ఆడుతోంది.
సీమాంధ్ర ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం
సమైక్యాంధ్ర ఉద్యమంలో 2013 ఆగస్టు 22వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సీమాంధ్ర అయ్యవార్లు బడులు మూసివేశారు. మొత్తం 49 రోజుల సమ్మె కాలంలో 33 రోజులు పనిదినాలు కోల్పోయారు. వీటికి బదులు రాబోయే ఆదివారాలు, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని పేర్కొంటూ ఈనెల 19వ తేదీన ఓ మెమో (ఆర్‌సి నంబర్ 31) విడుదలైంది. సెలవు రోజుల్లో చదువు చెప్పాలని గట్టి ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం జీతాల జీఓ విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రస్తుతం సమ్మె కాలపు జీతాలకు సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలన విభాగం కూడా దాటలేదు. అటు నుంచి విద్యాశాఖ, ఆర్థిక శాఖలను దాటుకుంటూ ముఖ్యమంత్రి వద్దకెళ్లేసరికి కనీసం ఐదు, ఆరు రోజుల సమయం పడుతుందని విశ్వసనీయ సమాచారం.
మాటలు ఘనం.. చేతలు శూన్యం...
తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని, సమ్మె వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు గురించి ఆలోచించండంటూ చర్చల సమయంలో తీపి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవసరం తీరిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఇక్కడి అయ్యవార్లు మండిపడుతున్నారు. సమ్మె ముగిసి మూడు వారాలు దాటినా జీతాల జీఓ విడుదల కాకపోవడం పట్ల వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయులకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అయ్యవార్ల ఎదురుచూపులు...
దాదాపు రెండున్నర లక్షల మంది సీమాంధ్ర అయ్యవార్లు గత మూడురోజులుగా జీతాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి ఉద్యమాలు చేసిన ఉపాధ్యాయులు నేడు బడులకు పోతూ కూడా జీతాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది. వాస్తవానికి ఉపాధ్యాయుల జీతాల బిల్లులను సంబంధిత ఎంఈఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రతినెల 25వ తేదీలోపే ఖజానాకు పంపించేవారు. జీఓ త్వరగా వస్తే ఒకేసారి మూడు నెలల జీతాల బిల్లులను పెట్టుకోవచ్చన్న ఆశతో చాలామంది అధికారులు అక్టోబర్ నెల జీతాల బిల్లులను కూడా ఆపి ఉంచారు. అయితే జీఓ రోజురోజుకు ఆలస్యమవుతుండడంతో వీరి ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వంద్వ నీతిని మానుకొని జీతాల జీఓ విడుదలపై దృష్టిసారించాలని సీమాంధ్ర ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదేం న్యాయం
Published Wed, Oct 30 2013 2:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement