సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా సింహపురి వాసులు సింహాలై గర్జించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ దద్దరిల్లేలా నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమాలతో నెల్లూరు దద్దరిల్లింది. 54వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. నెల్లూరులో బలిజ, తెలగ, కాపు సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన పేరుతో భారీ ర్యాలీ జరిగింది.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బలిజ సంఘీయులు సమైక్యవాణి వినిపించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ పొట్టిశ్రీరాములు విగ్రహం, కనకమహల్ సెంటర్, గాంధీబొమ్మ మీదుగా వీఆర్‌సీ వరకు సాగింది. ర్యాలీలో శ్రీకృష్ణదేవరాయలు తదితర వేషధారణలో ఉన్న వ్యక్తులు ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముస్లింలు కోటమిట్ట నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరాహారదీక్షలో కూర్చున్నారు. వీరి కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో
ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. వీఆర్‌సీ కూడలిలో యూటీఎఫ్, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలేదీక్షలు కొనసాగాయి. గాంధీబొమ్మ సెంటర్‌లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగించారు. వీఆర్‌సీ సెంటర్‌లో సోనియా దిష్టిబొమ్మను టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు దహనం చేశారు. పొదలకూరురోడ్డులోని నేతాజీనగర్ వాసులు వాటర్‌ట్యాంకు సెంటర్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో యాదవ శంఖారావం జరిగింది. స్థానిక అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు
భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీకృష్ణుడు వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయగిరి బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దీక్ష కొనసాగించారు. సీతాతామపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగించడంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ, దుత్తలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. వరికుంటపాడులో వెంగమాంబపురం వివేకానంద యూత్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు.
గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో ఆర్టీసీ కార్మికులు రిలేదీక్ష చేశారు. జేఏసీ నాయకులు గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు ఆత్మకూరు నుంచి పెంచలకోన వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్ విగ్రహ కూడలిలో చేనేత కార్మికులు రోడ్డుపైనే మగ్గం నేశారు. కావలిలో ఉద్యోగులు, ఆర్టీసీ, సమైక్యాంధ్ర జేఏసీలు, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
సమైక్య గర్జన
Published Mon, Sep 23 2013 4:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement