సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం
Published Thu, Oct 10 2013 4:45 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
సాక్షి ప్రతినిధి, కర్నూలు :ఊరూ.. వాడ, చిన్నా.. పెద్దా తేడా లేకుండా జనం సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నియోజక వర్గ సమన్వయకర్తలు, మండల నేతలు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం ఉద్యమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రైల్వేశాఖ సహాయం మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విభజన ప్రకటన వెలువడిన రోజే ఢిల్లీ వెళ్లారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అధికంగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఒకటి రెండు సార్లు జిల్లాకు వచ్చినా వారిని సమైక్యవాదులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి టీజీ వెంకటేష్ తాను సమైక్యవాదినని మీసం మెలేసి తొడగొట్టి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో ఉద్యమం మహోద్యమంగా మారింది. ఉద్యమకారులు తీవ్రస్థాయిలో ఉద్యమాలకు తెరతీశారు. టీజీ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలులో ఇంతపెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మంత్రి కానీ, ఆయన అనుచరులు కానీ ఉద్యమకారులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా ఉద్యమంలో పాల్గొని ఓ రోజు దీక్ష చేసి వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఉద్యమం ప్రారంభంలో ఓ రోజు ర్యాలీలో పాల్గొని హైదరాబాద్ వెళ్లిపోయారు. కేబినెట్ ఆమోదం తెలియజేసిన రోజు పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను సమైక్యవాదులు నమ్మటం లేదు. ఇక కోడుమూరు, నందికొట్కూరు, ఆలూరు ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామి, నీరజారెడ్డి పత్తాలేకుండా పోయారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మాత్రం ఐదురోజులు నిరాహారదీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర శూన్యమేనని సమైక్యవాదుల అభిప్రాయం.
రెండు కళ్ల సిద్ధాంతానికే కట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యేలు...
అధికార కాంగ్రెస్ నేతలు తీరుకు ఏమాత్రం తీసిపోని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు కేఈ కృష్ణమూర్తి డోన్‌కు వచ్చిన సందర్భంలో ఉద్యమం చేస్తున్నవారికి సంఘీబావం తెలియజేసి వెళ్లిపోయారు. తరువాత అటువైపు తిరిగిచూసిన దాఖలాలు కనిపించలేదని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కర్నూలులో దీక్షా శిభిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఆదోనిలో ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కూడా మొదట్లో ఆందోళనలో పాల్గొన్నారు. ఆతరువాత కనిపించకుండాపోయారు.
మిగిలిన నియోజక వర్గ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారికేమీ తీసిపోని విధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమం చేయలేకపోయినప్పటికి విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటానికే మొగ్గుచూపుతున్నారని సమైక్యవాదులు విమర్శలు చేస్తున్నారు. ఒకరిని విమర్శించటానికే పరిమితమైన కాంగ్రెస్, టీడీపీ నేతలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై దాడులుకు దిగామని చెపుతున్నారు. అలా దాడులకు దిగిన సమైక్యవాదులపై కొందరు అధికార కాంగ్రెస్ పెద్దలు అక్రమ కేసులు బనాయించటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీరికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామని హెచ్చరిస్తున్నారు.
అలుపెరగని పోరుచేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
ఆళ్లగడ్డ శాసనభ్యురాలు, వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆదినుంచీ ఉద్యమంలో దూకుడుగా ఉంటూ కార్యకర్తలను, శ్రేణులను ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కూడా ఉద్యమంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తన అనుయాయులూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఆ పార్టీకి చెందిన సమన్వయ కర్తలూ పాదయాత్రలతోనూ, రిలే దీక్షలతోనూ ముందడుగు వేసి ప్రజా మన్ననలు పొందుతున్నారు.
Advertisement
Advertisement