సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో రెండు నెలలుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరో నేత తోడయ్యారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పోరుబాట సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి సమైక్య ఉద్యమ జెండా భుజానికెత్తుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మరుసటి రోజు శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కలిసి గత ఆగస్టు 2న తాను ఇచ్చిన రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా కోరారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలు విన్న స్పీకర్ ఏమీ మాట్లాడలేదని, అధికారులు తన మాటలను రికార్డు చేసుకున్నారని ఆయన తెలిపారు.
చూస్తూ ఊరుకోలేను... 13 జిల్లాల ప్రజలు, ఉద్యోగులు రెండు నెలలుగా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తుంటే బాధ్యత గల ఎంపీగా చూస్తూ కూర్చోదలుచుకోలేదని నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆగస్టు 2నే రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినప్పటికీ, ఆమోదం పొందలేదన్నారు. రాజీనామాలు ఆమోదించుకున్నాకే ఉద్యమంలోకి రావాలని ప్రజా ప్రతినిధులకు ప్రజలు, జేఏసీ నాయకులు స్పష్టంగా చెపుతున్న నేపథ్యంలో తాను ఆ దిశగా అడుగులు వేసినట్లు చెప్పారు.
ఇక నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొంటానన్నారు. ప్రస్తుతం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అని, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమైక్యాంధ్రకు ప్రతినిధిగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. జననేత నేతృత్వంలో సమైక్యాంధ్ర కొనసాగుతుందన్న నమ్మకం ఉందని, సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భావితరాల ఆశాదీపిక వైఎస్సార్ తనయుడు ఒక్కరేనని, అందుకే ఆయనకు అండగా నిలిచినట్లు చెప్పారు.
ఇక చురుగ్గా... ఉద్యమం లోకి
Published Sun, Sep 29 2013 5:17 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement