సాక్షి, అనంతపురం : ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఉద్యమ బాట వీడుతున్నా సామాన్య జనం మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా పోరు సాగిస్తున్నారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో 80వ రోజైన శుక్రవారం కూడా ‘అనంత’లో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అనంతపురంలో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ విభాగం వద్ద ఆందళన చేశారు. యువ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ముట్టడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెలు అమ్ముతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు దిగుతామని గుంతకల్లులో మునిసిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గుత్తిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తోపుడుబండ్లపై పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
హిందూపురంలో ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై..సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శెట్టూరులో జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. పెనుకొండలో న్యాయవాదులు, విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
వీరికి ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మద్దతు తెలిపారు. ఏపీ ఎన్జీవోల ఉద్యమంపై విమర్శలు గుప్పించిన మంత్రి కొండ్రు మురళి దిష్టి బొమ్మను జేఏసీ నాయకులు దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి.. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. వీరికి కాపు భారతి సంఘీభావం తెలిపారు. కణేకల్లులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. రాప్తాడులో జేఏసీ కన్వీనర్ ఎంఈఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్‌లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలే దీక్ష కొనసాగింది. వీరికి వైఎస్సార్‌సీపీ నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధ్యాయులు విరామసమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆందోళన చేశారు. బత్తలపల్లిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
జనోద్యమం 80
Published Sat, Oct 19 2013 3:02 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement