ఒకటే గమ్యం.. గమనం | united agitation become severe in kurnool district | Sakshi
Sakshi News home page

ఒకటే గమ్యం.. గమనం

Published Sun, Sep 29 2013 5:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

united agitation become severe in kurnool district

సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర కోసం లక్షల గళాలు ఘోషిస్తున్నాయి. వేల పిడికిళ్లు బిగిస్తున్నాయి. ఒకటే గమ్యం..గమనంతో సకల జనం ఉద్యమబాట పడుతున్నారు. తెలుగు జాతిని విడదీయవద్దంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 60వ రోజు శనివారం ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగాయి. రహదారుల దిగ్బంధం, వంటావార్పులతో ఉద్యమకారులు కదంతొక్కారు. రాష్ట్రాన్ని విభజిస్తే భావితరాల వారు రోడ్లపై మిర్చిబజ్జి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.  విభజన హోటల్ పేరిట టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విభిన్న రకాల అల్పహారాలను ప్లేట్ రూ. 10లకే విక్రయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నగరపాలక సంస్థ ఉద్యోగులు నగరంలో మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ నోట్‌ను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తే కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.
 
 ఆదోని పాతబస్టాండ్ సర్కిల్‌లో నిర్వహించిన గర్జనకు వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరైన దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఆళ్లగడ్డలో గాంధీ విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆలూరులో ఉపాధ్యాయ జేఏసీ మహిళా నేతలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. పత్తికొండ పట్టణంలో 18 మంది ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. దేవనకొండలో జెడ్పీ హైస్కూల్ చెందిన పూర్వపు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోడుమూరు పట్టణంలో ఫొటోగ్రాఫర్లు, సప్లయర్ షాపు యజమానులు కదం తొక్కారు. ప్యాలకుర్తి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరాహార దీక్షకు కూర్చున్నారు. గూడూరులో చికెన్ వ్యాపారులు, సి.బెళగల్‌లో కూల్‌డ్రింక్స్ యజమానులు రిలే దీక్షల్లో కూర్చున్నారు.
 
 ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రిలే నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్షల్లో శనివారం వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. డోన్ , ప్యాపిలి, వెల్దుర్తిలో దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని శివ సర్కిల్‌ను దిగ్బంధించారు. అనంతరం సర్కిల్‌లో వివిధ ఆటలు ఆడుతూ మధ్యాహ్నం వరకు విద్యార్థులు నిరసన తెలిపారు. ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం శివ సర్కిల్‌లో పొదుపు మహిళల చేత మహిళా ప్రయాణికులకు బొట్టుపెట్టించి నిరసనను వ్యక్తపర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement